పుట:Narayana Rao Novel.djvu/219

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
218
నా రా య ణ రా వు


తన జీవితములోని కళ నశించిపోయిననేమి? సంగీత, సాహిత్య, చిత్రలేఖనలతో తనకేమి పని?

ఒకరోజున చటుక్కునలేచి ‘నాన్నా! నేను దేశయాత్ర చేసివద్దామని ఉంది’ యని నారాయణరావు తండ్రికి విన్నవించెను. తండ్రి యాశ్చర్యమంది ‘చదువుకుంటూ దక్షిణాదంతా చూసివచ్చావుకాదుట్రా?’ అని ప్రశ్నించెను.

‘ఈపట్టు ఉత్తరాది చూస్తాను నాన్నా.’

‘ఉత్తరాది అంటే?’ ఉత్తరాది యన్న సుబ్బారాయుడుగారికి తెలియక కాదు. పుత్రు డడుగుటయే యాయన కాశ్చర్యమైనది.

‘కాశీ, ప్రయాగా అన్నీ తిరిగివస్తాను.’

‘ఒక్కడవూనా?’

‘పరమేశ్వరుడూ నేనూ వెళ్తాము.’

‘ఎన్నాళ్ళు?’

‘నెలా రెండునెలలో.’

‘ఆలోచిద్దాములే.’

‘అదికాదు నాన్నా! తర్వాత నేను పట్టాపుచ్చుకొని వృత్తి ప్రారంభిస్తే దేశం చూచుటకు వీలుండదు.’

‘చూద్దామన్నాను కాదుట్రా, బాబూ.’

ఆ సాయంకాలము సుబ్బారాయుడుగారు భార్య నొంటరిగాజూచి చిన్నబాబు కాశీ అదీ వెళ్ళివస్తాడుట, తర్వాత వాడికి వీలుండదు. దేశాలన్నీ తిరిగివచ్చి వృత్తి ప్రారంభిస్తే బాగానే ఉంటుంది? అని తెలియజేసెను. జానకమ్మగారికి గుండెలో రాయిపడినది. ప్రయాణాలంటే మాటలా? మరునాడు పురోహితునకు గబురంపి సుబ్బారాయుడుగారు శుభముహూర్తము పెట్టించెను. సుబ్బారాయుడుగారు, భార్యయు, వదినెగారును ఇదివరకె కాశీ వెళ్ళివచ్చినారు. అందుచేతనే జానకమ్మగారు ఎట్టులో కుమారుడు వెళ్ళివచ్చుటకు నియ్యకొన్నది.

నారాయణరావు పెట్టెలు, పరుపు మొదలగునవి సర్దుకొని తండ్రి యిచ్చిన నాల్గువందలరూపాయలు పుచ్చుకొని, లెక్క కావలసినప్పడు తనకు తంతివార్త నిమ్మను తండ్రిగారికి దలయూపుచు తల్లికడకు వెళ్ళినాడు. కుమారుని దరికి జేరదీసికొని శిరస్సు మూర్కొని ‘నాయనా! రామలక్ష్మణులులా నా కిద్దరు వరప్రసాదులు పుట్టారు. జాగ్రత్తగా వెళ్ళిరా. మీమీదే ప్రాణాలు పెట్టుకొని ఉన్నాను. నువ్వు దుందుడుకు మనిషివి. రైలు కదులుతోంటే ఎక్కుతావు. వాడికీ వీడికీ ఆపత్తు వచ్చిందని పరుగెత్తుతావు. జాగ్రత్తరా తండ్రీ’ యని యామె యాశీర్వదించి కుమారుని పంపెను.

శుభకార్యమునకై వచ్చిన బందుగులు, అక్కగార్లు, చెల్లెళ్లు, ఎవరియిళ్లకు వారు అప్పుడే వెళ్ళిపోయినారు. సూర్యకాంతమున కేమియు దోచుటలేదు.