పుట:Narayana Rao Novel.djvu/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

నా రా య ణ రా వు

తున్నాను. నీకు నామీద ప్రేమలేకపోవచ్చును. కాని అనేకమంది సంగతి చూడు. మీ నాన్నగారి పెళ్ళి అయినప్పుడు మీ అమ్మగారిమీద ప్రేమచేత పెళ్ళిచేసుకొన్నారా? అయినా ఎంత ప్రేమగా ఉన్నారు! మీ అక్కయ్య మీ బావని ప్రేమచేత పెళ్ళి చేసుకుందా? అయినా దంపతులిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారో! పనసతొనల్లాంటి బిడ్డల్ని కన్నారు. అలాగే మీ కుటుంబంలోనూ, మా కుటుంబంలోనూ, మనదేశం అంతలో జరుగుతున్నాయి. నువ్వు చేసే విడ్డూరం ఎక్కడాలేదు శారదా! నేను మామూలు తుచ్ఛులగు భర్తలవంటివాడను కానే? నా భర్తత్వం నీకు హేయం అయితే పోనీ, నా స్నేహమున లోపమేమున్నది? నేను కలుసుకొన్న ప్రతివాళ్లూ నేనంటే స్నేహంగా ఉంటారే?

శారద తలవాల్చికొని యట్లే మంచముమీద కూర్చుండియున్నది. నారాయణరావామె మనస్సు కరుగుచున్నదేమో యనుకొన్నాడు. ధైర్యము చేసి యామెపై చేయివైచి చెంతకు లాగికొనబోవ నామె గింజుకొని ‘అబ్బా నా_కి_దే_మి_టి_బాబూ’ అన్నది.

నారాయణరావు చిన్నబోయి యామెను జుట్టియుంచిన చేతులు విడదీసి దీర్ఘముగా నిశ్వసించి,

‘నువ్వు నెమ్మదిగా తలుపుతీసికొని వెళ్ళిపో. నేను తెల్లవారువరకూ ఇక్కడుంటాను’ అని మంచముపై పరుండెను. శారద గదిగుమ్మముదగ్గరకు వెళ్ళి తన యక్కగారు పైన గొళ్లెము వేసిన సంగతి జ్ఞాపకము రానట్లే యచ్చట నిలుచుండిపోయెను. నారాయణరా వదిచూచి యచ్చటకు బోయి తలుపులాగి చూచుటయు నది తీసియేయుండెను. తానప్పుడువచ్చి మంచముపై పరుండి నిద్రపోయినట్లు నటింపసాగెను.

ప్రేమకు దివ్యచక్షువులున్నవి. కావుననే ప్రేమాస్పదులగువారి హృదయమును మనమిట్టె గ్రహింతుము. నాటి రేయి తన మఱిదియు జెల్లెలు నత్తరువు లలదుకొన్నప్పుడు తనచెల్లెలు భర్తయగు నారాయణరావును బ్రేమించుట లేదని శకుంతలాదేవికి మెరపువలెదట్టినది. ఆమె హృదయము చలించినది. నారాయణరావునం దామెకు బ్రేమ వెల్లువవలె బొర్లిపోయినది. అతడు తనభర్త అయినచో దనజన్మ సార్థకమయియుండునుగదాయని యనుకొన్నది. అందమయినవాడు. నిజమైన పురుషుడు. ఉత్కృష్టమగు తెలివితేటలుగలవాడు. అంతకన్న బ్రేమింపదగిన భర్త దొరుకుట కలలోనివార్త. శారద వెఱ్ఱిపిల్ల. తన భర్తకన్న శారదమగడు సర్వవిధాల పూజింపదగినవాడు. తా నదృష్ట వంతురాలని సంతోషించవలసిన శారదకు భర్తపై నింత హేయభావము కలుగుటకు కారణము దాని పెంకితనమే. తామందరు ఈ బాలిక హృదయాన్ని పాడుచేయలేదా! ఈ కన్నతల్లి యెదుట తాను, తనతల్లి, అందరూ తన మఱిదిని, దేవతామూర్తియైన తన మఱిదిని, ఆడిపోసుకొనలేదా?