పుట:Narayana Rao Novel.djvu/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రి క్త కాం క్ష లు

అప్పటికి గడియారము మూడున్నర కొట్టినది. శారదకడకు బోయి యచ్చట కూర్చుండి ‘ప్రాణేశ్వరి శారదా! ఈ శుభముహూర్తం ఇల్లా గొడ్డు వేళ కాకూడదేమో? నువ్విట్లా పడుకోవడం బాగుండదు. వచ్చి ఆ మంచము పైన పడుకో, నీకు ఇష్టం లేకపోతే నేనా సోఫాపైన పడుకుంటాను. మనం వృధాగా మేలుకొని ఉండడం ఎందుకు...?’

ఆమె తలవంచి యట్లేకూర్చున్నది. ‘ఒకటి మాత్రం మరువకు సుమా! నేను నీకు భర్తనయ్యాను కదా అని, నా అధికారాలుగాని, నాకున్న హక్కులుగాని నేను కోరను. నీకు యిష్టం లేదంటావా, నా మొగం నీకు మళ్ళీ చూపను. నీ మనస్సు కష్టపెట్టుకొనకు. మనము చదువుకున్న వాళ్ళము. నువ్వూ పరీక్షలు నెగ్గుతున్నావు. నాగరికురాలవు.’

శారద మాట్లాడలేదు.

నారాయణరావు తిన్నగా పోయి, యొకసోఫాపై చదికిలబడి నిట్టూర్పు నించి, హృదయపుటమున పావకజ్వాలలు సెలరేగ, జేతితో మొగము గప్పుకొని యా సోఫాపై వాలిపోయినాడు.

శారద పరీక్షలో నెగ్గిననాటినుండి తాను విద్యావతి ననియు నాగరిక వనితననియు విఱ్ఱవీగినది. నవలలో జదివినయట్లు చదువుకొన్న ‘విద్యావంతురాలు’ ప్రేమయొక్క తత్వము దెలిసికొనవలె. ప్రేమాస్పదుడుగాని పురుషుడు పరపురుషుడే. ప్రేమబంధనమే విధివిహిత మగు వివాహబంధనము.

ప్రేమాస్పదుడుగాని పురుషుని స్పృశించుటెట్లు? అమెరికా ‘దొరసాని’ యామె యుపాధ్యాయురాలు ప్రేమతత్వ మామెకు బోధించినది. పాశ్చాత్యదేశముల ముఖ్యముగా నమెరికాఖండములో పొరబడివివాహము చేసి కొన్న స్త్రీ, పురుషులు ప్రేమలేదని గ్రహించిన నిమిషమున నా వివాహము రద్దుచేసికొనెదరట. ఒకరిమీద నొకరికి, బ్రేమలేదని తెలిసిన మరుక్షణము ఒకరి నొకరు ముట్టుకొనరట.

ఆమె ఇంటరు పరీక్షకు దీక్షతో జదువుచున్నది. ఇంటికడనే యుండి చదువుచున్నది. చదువుకొను నితరబాలికలతో స్నేహము కుదిరినది. చదువు కొను బాలలు వివాహము చేసికొనుటకన్న వేఱు పొరపాటు లేదట. పాశ్చాత్య విద్య చదువుకొను బాలలకు హృదయమున మంచుతెరలు విడిపోవునట. మొరకులగు స్త్రీలకు బ్రేమస్వరూపమే తెలియదు. వారు పశువులవలె నత్త వారిండ్లకు వెళ్ళెదరు. వారు భర్తకు సొత్తయి యాత డేమిచేసినను భరించి జీవితాదర్శ