పుట:Narayana Rao Novel.djvu/207

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
206
నా రా య ణ రా వు

శారద గుండె చెదరున ట్లేడువదొడంగెను. నారాయణరావు చకితు డయ్యెను. అతని హృదయము కుంచుకొనిపోయినది. అతడు తెల్లపోయినాడు. ఆ బాలిక నచ్చటనే వదలివచ్చి యొక దిండ్లకుర్చీపై కూర్చుండెను. అరచేతిలో మోము నాన్చి శూన్యమనస్కుడై శూన్యమగుదెసలజూచినాడు నారాయణరావు.

అరగంట అయినది. శారదయేడుపు తగ్గినది. నారాయణరావు శారదవైపు చూచుచు, నామెయందము తనివితీర గ్రోలుచు, హృదయమును సమాధానపరచుకొనుచు నట్లే యుండెను. శారద తలుపుమూలనే నిలుచుండి యున్నది. పదునైదేండ్లు నిండిన నవయౌవన సౌందర్యపూర్ణ! ఏమి యీ చిత్రము! లోకములో సిగ్గులున్నవి. కోపములున్నవి. కాని చదువుకొన్న బాల, ప్రవేశ పరీక్షలో విజయము గాంచినది. కళాహృదయ. ఏమిటీ విచిత్రము! నారాయణరా వా బాలిక నాయాలోచనలతో నట్లే తేరిపార జూచుచుండెను.

కొంతవడికి నారాయణరావు లేచి ‘శారదా, నువ్వు మంచముమీద పడుకో, ఇక్కడ ఇల్లా నిలుచుంటా వెందుకు’ అని యామెను పుష్పమువలె నవలీలగ నెత్తి తన హృదయమున కదుముకొని ముద్దునిడబోవ నా బాలిక చటుక్కున మోము వెనుకకు ద్రిప్పుకొన్నది. నారాయణరావు సిగ్గుపడి యామెను గొనిపోయి పల్యంకమున బన్నుండబెట్టను. ఆమె మరుక్షణమున లేచి, మంచము దిగి, మరల గదిగుమ్మము కడకేగి నిలుచున్నది.

అది యంతయు నభినయము కాదుగద? స్త్రీలు కేళీమందిరమున ప్రథమ మున నిట్లే చరింతురుకాబోలు. అట్టియప్పుడు తానేమి చేయవలెను? రాజారావుకాని, పరమేశ్వరుడుకాని వారి ప్రథమ సమాగమదినము వర్ణించి చెప్పినప్పు డిట్టిరీతి చెప్పలేదు! రాజారావును భార్యయు కొంచెము సిగ్గుపడిరోలేదో, తలుపువైచిన యరగడియకే వారిరువు రొకరి కౌగిలింతల నొకరు మరిగిపోయిరట. పరమేశ్వరుని భార్య ఇంకను కొంచెమాలస్యము చేసినది. కాని, రెండు గంటలలో సంపూర్ణముగా ప్రాణకాంతు హృదయమున ద్రవించిపోయినదట. ఇంకను పెక్కురు స్నేహితులు చెప్పివారు. కాని ఈ వైపరీత్యమేమి!

‘శారదా, నువ్వు చదువుకున్నదానవు, తెలివైనదానవు. ఏమిటి సంగతీ?’ యని భర్త శారదను బ్రతిమాలినాడు. శారద యంత మొండియైనదేమి?

శారద తన్ను ప్రేమించుటలేదేమో యని యొక్క యశరీరవాణి అతని హృదయమునకు మెరుమువలె ప్రత్యక్షమైనట్లయినది. తాను కురూపియా? మూఢుడా?

అనురక్తి విరక్తులకు మనుష్యుని రూపముగాని, గుణగణముగాని, యాతని తెలివితేటలుగాని కారణములుగావు. పూర్వకర్మయే కారణము కాబోలు. ఈ మానవ హృదయ గ్రంథాంతరార్ధములు కనిపెట్టగలిగినవాడు మహానుభావుడు.

శారదకడకు మరల నారాయణరావు పోయినాడు. ఆ బాలిక నిలుచుండ లేక యచటనే యాగదియంతయు బరచియున్న రత్నకంబళిపై కూలబడినది.