పుట:Narayana Rao Novel.djvu/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శో భ న మం ది ర ము

205


ఒంటిగంటయైనది. ఇంకను శారదను లోనికిబంపలేదు. గడియారము వంకజూచి, నారాయణుడది యంతయుదంతులోని భాగమా యని సందేహించినాడు. అతని దేహము మధురాతిమధురమగు నొక మత్తుచే నావరింపబడినట్లయినది. తా నిదివరకు జూచిన పునస్సంధానముల కిట్లాలస్యము చేసినారా?

లేచి యాతడు తల్పముపై పరుండినాడు. ఈ తల్పము పురాతన తల్పమువలె నున్నది. ఇయ్యది తన మామగారి పూర్వీకులదేమో?

ఒక దేశమున కొక యాచారముండును గాబోలు. ప్రథమ సమాగమ సమయములందు ముగ్ధలగు బాలికలెట్లు చరింతురో?

స్త్రీ పురుష సమాగమ మింత మాయామోహితమా? మానవుల మూల మట్టముగ కదలించి వేయునుగదా స్త్రీ, పురుష సమాగమము! తన సర్వస్వము ధారపోయగలడు మనుజుడు స్త్రీకై. స్త్రీ పురుషుల ఈ మోహముచే ప్రపంచ చరిత్రమే మారిపోవునట!

తానెట్లు సంచరించవలయునో?

గడియారము మృదుస్వనమున రెండుకొట్టినది.

చటుక్కున శారదను లోనికంపి శకుంతలయు, వారి మేనత్తయు పైకి వెడలి తలుపు పైనగొళ్ళెము వేసినారు.

అంతయు నిశ్శబ్దము.

ఆ నిశ్శబ్దములో వెక్కి వెక్కి లోలోదుఃఖించు శబ్దము నారాయణరావునకు కర్ణగోచరమైనది. ఆత డులికిపడినాడు. శారదయే యేడ్చుచున్నది. ఏమిటి? సిగ్గుకాబోలు! భయమా? అది కొంతసేపటికి తగ్గునేమో? ఏమి చేయవలె? అతనికి సిగ్గు వేసినది.

అతడు నెమ్మదిగాలేచి శారదకడకు బోయి ‘శారదా! ఇక్కడ నిలుచున్నావేం?’ అని యడిగినాడు. శారద మాట్లాడలేదు. ఆమె యింకను భుజములు కదల్చుచు లోలోన నేడ్చుచున్నది.

అతని హృదయమున అనుకంప వెల్లివిరిసి యుబికి దిశల నాక్రమించుకొని పోయినది. ఆమెను దరికి జేరదీసికొన్నాడు. శారద కుంచుకొనిపోయినది. ముకుళించుకొనిపోవు పుష్పమైనది.

‘ఎందుకు నువ్వు ఏడుస్తావు పిచ్చిదానా! నిన్ను ప్రేమించి నిన్ను నాలో చేర్చుకొను ప్రేమమూర్తినిసుమా! నీ వంటి దివ్య సౌందర్యమూర్తి నాకు ప్రణయిని అయిందంటే నా అదృష్టంకాదా శారదా? ఈ నన్నావరించిఉన్న యీ పురుషత్వ సౌభాగ్యం, నా తెలివితేటలు, నా సమస్తం నీ పాదాలకడ అర్పిస్తున్నా. నేనింతవరకూ ఎవరినీ ప్రేమించలేదు శారదా? ఏనాడు నిన్ను చూశానో ఆ క్షణంలోనే, నా హృదయేశ్వరి, నా జీవితేశ్వరి ఈమే యనుకొన్నాను’ అన్నాడు.