పుట:Narayana Rao Novel.djvu/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శో భ న మం ది ర ము

203


‘ఆరోహోరు ముపబర్హ స్వబాహుం పరిష్వజస్వ’ అని వధూవరసంశ్లేష సంయోగమంత్రము వసిష్ఠాది భూదేవతలు ప్రారంభించిరి. ఆహో! ఈ సంగమ ధర్మమును మహోత్తమ స్థితికి గొనిపోయిన దా ఆర్యధర్మము! నారాయణుడు దివ్యుడే అయినాడు.

భార్య కెడమవైపున గూర్చుండి, కుడిచేత నామె తనువల్లిని చుట్టి, ఫలములతోనున్న పళ్ళెరమునుబట్టుకొన్న దివ్యక్షణము లాతని నానంద తన్మయుని జేసినవి.

‘తం మే వాయో సమర్థయ’ ఆశీర్వాదములైనవి.

భార్యాభర్తలను లోనికి గొనిపోయి పాయసము ద్రావించినారు. వారి నిరువుర శోభనమందిరములో, శోభనతల్పాన కూర్చుండ బెట్టినారు.

శోభనమందిరము దివ్యకళామయముగ నమర్చబడినది. గోడలు పాలరాతి వలె స్నిగ్ధములు. నందలాలు, ప్రమోదకుమార, అవనీంద్ర, దేవీప్రసాదరాయ, ఆసిత కుమారాది చిత్రకారకుల చిత్రములు; దామెర్ల రామరాయలు, పరమేశ్వరమూర్తి మొదలగు నాంధ్ర చిత్రకారకుల చిత్రములు అందందు మనోహరముగ వ్రేలాడదీయబడినవి. విశాలమగు నా మందిరమంతయు రంగు రంగుల దీపముల శబలకాంతులచే దీప్తిమంతమైపోవ, పట్టుజాలరులు, కలంకారీ తెరల యందములు విరిగిపోవ, నిలువుటద్దములు తమ హృదయములలో మందిరాంతరములు వేనకువేలు సూప, దంతపుబల్లపై చందనపు వెండి రాగి విగ్రహములు; కొండపల్లి, నక్కపల్లి కఱ్ఱబొమ్మలు; ఆగ్రా స్ఫటికశిలాప్రతిమలు; లక్నో లోహ సామగ్రులు, మెరుగులీన నాగది నలకూబరుని కేళీమందిరమై విలసిల్లిపోయినది. దంతపుకోళ్ళ పెద్ద పందిరిమంచము చిత్రమగు తెరలతో, పాలసముద్రమువంటి దుప్పటితో, పట్టు ఉపధానములతో, నలంకారములతో చిత్రవిమానమువలె నున్నది. పరుపు హంసతూలికలతో కూర్చినది. ఒకచో రంగుదుప్పట్లు పరచిన బల్లపై, చెన్నపురిలో ఆంధ్రదేశములో దొరుకు చక్రకేళులు, బత్తాయిలు, సాతుకుడులు, అనాసలు, అంజూరలు, దానిమ్మలు, కాబూలిద్రాక్షలు, కిసిమిసులు, నాగపూరు సంత్రాలు, కర్బూజలు, మామిడిపళ్లు, పచ్చవాలప్పణి, సేంద్రజాలప్పణి, మలైవాలప్పణీ మొదలగు నరటులు, సీమరేగులు ఇంకను వివిధఫలములు; వేరొక బల్లపై మినపసున్ని, అరిసెలు, లడ్డు, బర్ఫీ, దూద్‌పేడా, పాదుషా, జాంగ్రి, మైసూరుపాకు, రసగుల్లా, సందేష్, పకోడీ, కారపుపూస, జీడిపప్పు, బూంది మొదలగు పెక్కు తినుబండారములు నున్నవి. బల్లలకడ సోఫాలున్నవి. అగరువత్తులు సుగంధపు బొగల నెగపోయుచుండెను.

జమీందారుగా రీమందిర మలంకరించుటకై చెన్నపట్టణమునుండి నూరు రూకలు రానుబోను కర్చుల నిచ్చి యొక శిల్పిని తీసికొనివచ్చినారట. కొన్ని లక్షల మల్లెమొగ్గలతో, కనకాంబరాలతో, గులాబులతో శోభనమందిరము మధ్య తూగుటుయ్యల నమర్చినారు.