పుట:Narayana Rao Novel.djvu/192

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
191
నా దీ భా రం


భోజనములైనవెనుక వీరభద్రరావు నారాయణరావును ‘మీ అక్కయ్యను మీ యింటికి తీసుకెళ్తావా?’ అని ప్రశ్నించెను.

‘అదేమిటి బావా! రెండురోజులేగా అయింది మా అక్కయ్యవచ్చి! తర్వాత యేడోనెలలో తీసుకెడ్తాము. అన్ని రివాజులు తప్పించాలి అని మా అమ్మ గారంటూనే ఉన్నారు. పురిటికి రాజమండ్రి తీసుకెళ్లాలని ఉన్నది. ఏమంటావు? నీ యిష్టం అయితే మావాళ్ళ యింటికి తీసుకువెళ్తాం. లేకపోతే ఆస్పత్రిలోవుంచి అక్కడ పురుడుపోస్తాం. లేకపోతే నేను చెన్నపట్టణం తీసుకొని వెళ్ళిపోతాను. ఆలోచించుకో, అమ్మా వాళ్లూ వస్తారు.’

వీరభద్రరావుకు దానెందుకు దన యిల్లాలిని కొట్టినాడో తెల్లమైనది. జమీందారుగారువచ్చి పిలిచినాడు. జమీందారు వీరభద్రరావుగారిని బంపుడని డిప్యూటీకలెక్టరుగారి నడిగినాడు. డిప్యూటీకలెక్టరుగారు వీరభద్రరావుగారిని దీసికొనిపోవచ్చుననియు దనకు పరమసంతోషమనియు వీరభద్రరావు ఆఫీసులో కెల్ల మంచి గుమాస్తాయనియు దానును బ్రమోషనుకు వ్రాసినాననియు జెప్పినాడు. వీరభద్రరావు వెళ్ళవలెననియున్నను కలెక్టరుగారికి ముఖ్యమగు బనులుండుటచే, మకాంగుమాస్తా వీరభద్రరావు తప్ప నింకొకరు పనికిరారని యాయనకు తోచి వీరభద్రునితో నీవువుండి ‘నీ భార్యను బిల్లను బంపు’ మని చెప్పినారు. వీరభద్రరావు చేయునదిలేక, నిట్టూర్పులతో, హృదయమున ఝంఝామారుతముతో, భార్యను గూతును జమీందారుగారితో బంపినాడు. జమీందారుగారు తన మోటారు తోలువానితో ముందు కూర్చుండి, సత్యవతిని, కొమార్తెను వెనుక గూరుచుండబెట్టి, తన కారులో రాజమహేంద్రవరమునకు తీసికొని వెళ్ళిపోయినాడు.

జమీందారు గారు పెద్దలు, పూజ్యులు అని తానెరుగును. వేఱుతలంపులు దలంచుట హైన్యమనియు నెరుంగును. పండుగ నాలుగురోజులు వీరభద్రరావనుభవించినది యమలోకము. ఎంతమంది పరపురుషులు జమీందారుగారి యింటికి వచ్చెదరో? భార్య వారిని చూచునేమో? వారు తేరిపార భార్యను జూచెదరు కాబోలు. ఇదివరకెప్పడు భార్యను బుట్టింటికి పంపినను దానుగూడ వచ్చి, తనతో దీసికొనిపోవువాడు. పండగనా డెట్లయిన దాను రాజమహేంద్రవరము పోవలయునని యెన్నియోవిధముల బ్రయత్నించినాడు. కాని డిప్యూటీకలెక్టరుగా రొప్పుకొనలేదు.

ఇంటికి తన భార్యను పెద్దబావగారు శ్రీరామమూర్తి తీసికొనివచ్చి దిగబెట్టుటతోడనే భార్యపై మండిపడినాడు.

‘నువ్వు దౌర్భాగ్యురాలివి! నువ్వు పెద్దాపురం సానిదానికన్న నీచురాలివి. ఆపళంగా పరుగెత్తుతావూ! నీ మనస్సు చెడుమనస్సు కాకపోతే నువ్వలా తయారవుతావా? నీచపుముండా! అక్కడ యెందరకు ఉత్తరాలు రాశావో...’ ఇట్లు వినగూడని, వ్రాయగూడని, యుచ్చరింపరాని కారుమాట లన్నాడు. వీథిలో కాట్లాడు నూరకుక్కయైపోయినాడు.