పుట:Narayana Rao Novel.djvu/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడవాళ్ళ బ్రతుకు అథోగతి బ్రతుకు

189

‘ఒసే అక్కయ్యా! నువ్వు వెఱ్ఱి అభిప్రాయం ఎందుకు పడతావు! నేను బావను కొట్టలేను. కొట్టగలిగివుంటే అతనిపని బాగానే ఉండును. నాకు బలం లేక కాదు. అట్టి నీచపుపనికి నేను దిగలేను.’

ఆ సాయంకాలమునకు వీరభద్రరావు వచ్చునప్పటికి పడకకుర్చీలో గూర్చుండిన బావమరిదిని జూచి తెల్లబోయి ‘ఎప్పుడువచ్చావోయి బావా?’ యని ప్రశ్నించెను.

‘మధ్యాహ్నం.’

‘ఏం పనిమీద?’

‘చెన్నపట్నం వెళ్లబోతూ మిమ్మల్ని చూద్దాం అని వచ్చా.’

‘అలాగా! అని లోనికిబోయి ‘నాగరత్నం!’ అని కూతుర్ని పిలిచి, ఎందుకు వచ్చాడే మీ చిన్న మామయ్య?’ అని ప్రశ్నించెను.

నాగరత్నం గజగజలాడిపోయినది. ఆమె కళ్ళనీళ్ళు తిరిగినవి. నారాయణరావు గ్రహించి లోనికిబోయి బావగారితో నిట్లనెను.

‘బావా! ముసుగులో గుద్దులాట యెందుకు? నాగరత్నం వాళ్ళమ్మకి తెలియకుండా పక్కయింటివారు యిస్తే, కార్డుమీద మాయింటికి ఉత్తరం రాసింది. నేను వచ్చాను. నువ్వు చదువుకొన్నవాడివి. రేపు వియ్యమంద దలచుకున్నావు. నిన్ను గుఱించి ప్రపంచం ఏమనుకుంటున్నదో నీకు తెలియటంలేదు. బావా! మన కుటుంబాలలో ఇలాంటిది ఎక్కడన్నా ఉందటోయి!’

‘నాపద్ధతి అంతే. నన్నేమి చెయ్యమంటావు? నాకు కోపం జాస్తి, దాన్ని చంపుకుందామని ప్రయత్నంచేస్తే చావదు. నన్నేమి చెయ్యమంటావు?’

‘రాత్రి మాట్లాడుదాములే. ఇప్పుడేమి మాడ్లాడకు.’

తాను వాడుకొనుటకు కొన్న వెస్టు అండు కంపెనీ వారి ఎనుబది రూపాయల ఖరీదుగల బంగారు ‘కీపుసేక్’ అను చేతిగడియారము నారాయణరా వీయబోగా నతడు వలదని వారించినాడు. నారాయణరావు బావగారిని తీక్షణంగా జూచి ‘బావా, నువ్వంతకంతకు చాలా చిత్రంఅయిన మనిషివి అవుతున్నావోయి. మనం మగవాళ్లం. ఆడవాళ్ళు నీరసులు. ఎలా చూసినా వాళ్ళు మన చేతిలో ఉన్నారు. మనం దయదలచి, ఆడవాళ్ళని మనుష్యులుగా ఎంచాము. అయినా వాళ్ళు మన దృష్టిలో పశువులు. అంతే. వాళ్ళని చంపినా ఎవరూ ఏమనరుగదా? ఆఫ్రికా నీగ్రోలల్లే ఆడవాళ్లు వస్తువులేకదా బావా! బానిసలే ఆడవాళ్ళు? నిన్న మొన్నటిదాకా అరబ్బీ, పెరిసియా, టర్కీ దేశాలలో ఉన్నట్లు, బానిసత్వం మన దేశంలో కూడా ఉండాలనా మనం ఈరోజున ప్రయత్నం చేయవలసింది? బావా, నీ హృదయం సర్వవిధాలా మంచిది. పది మందిలో పేరు ప్రతిష్ఠలు సంపాదించుకుంటున్నావు. నీకోపం అంతా యింట్లో చూపిస్తున్నావుగాని, నీ పైఅధికారి పైన చూపించగలవా? అలాగైతే వెయ్యి