పుట:Narayana Rao Novel.djvu/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
184
నా రా య ణ రా వు


రాధా: మీరా, మీరు వాలఖ్యిలులే! మా నాయన గారు కరణీకం ఊళ్ళు పధ్నాలుగూ తిరిగి మిట్టమధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పటికి మా బామ్మా వాళ్ళు వడ్లుదంచి, బియ్యంచేసి అన్నంవండి, అటక మీంచి గుమ్మడికాయదింపి, తరిగి కూరవండేవారు. వంటా అయ్యేది, మా తాతయ్య వచ్చేవాడుట. స్నానం, సంధ్యావందనం అంతా అయ్యేటప్పటికి పన్నెండున్నర. అతిథి అభ్యాగతీ, ఇంట్లో వాళ్ళూ అంతా కలిసి యిరవైమంది భోజనాలు మగవాళ్ళు.’

నారా: నేను చెన్నపట్టణం వెళ్ళేలోపుగా దొడ్డంపేట వచ్చి మనవాళ్లందరిని చూసి వెళ్తాను తాతయ్యా!

రాధాకృష్ణయ్యగారు ఉన్న నాలుగు రోజులును సుబ్బారాయుడుగారు పినతండ్రికి తన పొలములు, దొడ్లు, పాకలు, తోటలు మొదలైనవన్నియు జూపించినారు.

తెలుగుదేశమే కాదు, భారతభూమియే యంత కంత కధోగతిలో బడిపోవుచున్నదని రాధాకృష్ణయ్యగారి మతము. మనుష్యుల కెప్పడును జబ్బులే, అలసులు, పట్టుమని పది అడుగులు నడువలేరు. నూరు సంవత్సరముల మాట యటుండనిచ్చి డెబ్బదియేండ్లు బ్రతికిన మగవాడేడీ!

‘ఒరే సుబ్బారాయుడూ, మనదేశం చేసిన పూర్వకర్మలవల్ల యింకాబతికి వుంది కాని ఈ రోజుల్లో జబ్బులకూ, వాటికీ దేశం నిర్మానుష్యమై యుండ వలసిందే, ఏమంటావు?’

‘అవును బాబూ! ఎట్లాగో దారీ తెన్నూ కనబడటంలేదు. చదువులు, నాగరికత, మోటార్లు, రైళ్లు, తిండిలోబలం తగ్గడం__ఈలాంటివన్నీ కూడు తున్నాయి.’

‘అవునురా. ఈ ఆనకట్ట వచ్చి మన కొంప మాడ్చింది. డెల్టాలలో ఉన్న జనం మెరకజనంకన్న భాగ్యవంతులు అని చెప్పుకోవడమే కాని వాళ్ళంత బీదవాళ్ళింకోళ్ళు లేనేలేరు. కాలవ మాగాణి అంతా నిస్సారం అయిపోయింది కాదుట్రా?’

‘దానికి తగినట్లు మిల్లుబియ్యం కూడాను.’

‘సరిపోయె, మఱేమీ! మా యింట్లో దంపుడుబియ్యం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే యిప్పటివాళ్లు డబ్బు లేకుండా, జవసత్తువులు లేకుండా వుండడానికి సగం కారణం ఏమిటనుకున్నావు? వీళ్ళకి దైవభక్తి నశించింది, సంధ్యావందనం లేదు, దేవుడుగుళ్ళోకి వెళ్ళరు, పూజా పునస్కారాలు లేనేలేవు. ఇవన్నీ సగం దేశాన్ని తగలేస్తున్నాయి.’

నారా: తాతయ్యా, నువ్వలా అంటావు, ఎప్పుడు ఉండేవంటావు భయం భక్తి పూజా పునస్కారాలున్నూ?

రాధా: ఎప్పుడా? మా కాలంలో.