పుట:Narayana Rao Novel.djvu/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ హు మ తి

181


‘ఇంత కోపంగావున్నావు, ఎవరిపై నేమిటి? నా పైని కాదుగదా? ఇదిగో! నీకో బహుమతి పట్టుకువచ్చినాను, పండగ బహుమతి. ఎంత చిన్న గడియారమో! ఇది అసలు బంగారంగాజుకు అతికించిఉంది. ఈ గడియారము చూడు. ముద్దులు గులుకుతూ లేదూ శారదా?’

శారద యదిజూచి ‘చాలా బాగుంది. మా నాన్న నాకిచ్చినగడియారం కన్న బాగుందే!’ యన్నది.

‘చేయియేదీ?’ యని జగన్మోహనరావు శారద యెడమచేయి పుచ్చుకొని యా బంగారుగాజు చేతిగడియారము నామె చేతికి బెట్టి, యాచేయి నిటు నటు త్రిప్పుచు ఆ చేయిని దన పెదవులకడకు గొనివచ్చి ముద్దిడుకొన్నాడు. శారద యొడలు ఝల్లుమన్నది. జగన్మోహనుడు శారద బుజముచుట్టు దనచేయి వేచి యామెను దనకడకు లాగుకొని యామెతల తన హృదయమునకు హత్తుకొనెను. శారద హృదయము దడదడ కొట్టుకొన్నది. అతని హస్తమునుండి నెమ్మదిగ తప్పించుకొని యాబాలిక ‘నువ్విచ్చిన గడియారము అమ్మకు చూపించివస్తా’ నని లోనికి వెడలిపోయినది.

ఆ సాయంకాలము పై మేడపై నొంటిగా గూర్చుండి జగన్మోహనుని కౌగలింతను గూర్చి యాలోచించుకొనుచున్నది. జగన్మోహనరావుబావ చాల మంచివాడు, అందమైన వాడును. కాని అతని కౌగిలింత తనకంత యిష్టమేల కాలేదు? తియ్యని జలదరింత పొందినమాటమాత్రము నిజము. ఇరువురి బహుమతులలో నెవరి బహుమతి బాగున్నది? వారిచ్చిన బహుమతియు చాల యందముగా నున్నదనుట కామె హృదయ మొప్పుకొనక తప్పినదికాదు.

జగన్మోహనుడు చాల అందగాడని యామెకు బాఠము నేర్పబడినది. కాని చదివిన ప్రతి నవలలో బలమైనవాడు, ఉత్కృష్ట గుణసంపన్నుడు, మేధావి, నిజమైన సౌందర్యవంతుడని వర్ణించినారు. చక్కని రవివర్మబొమ్మలు కాని, మోడరన్ రివ్యూలోని బొమ్మలుకాని అన్నియు తనభర్తను తలపింప జేయుచున్నవి. ఇరువురిలో నెవరెక్కువ యందమగువారో యామెకు నిర్ధారణ కాలేదు. అయినను వారికన్న జగన్మోహనుడే సుందరుడు కాకుండు టెట్లని యామె యనుకొన్నది.

జగన్మోహనుని బెండ్లి చేసికొనియున్నచో, దానొక జమీకి రాణియై యుండును. ఇప్పుడు పల్లెటూరిలో నుండవలసివచ్చినది. భర్త ఉద్యోగము చేసినమాత్ర మేమిలాభము? బావ యెప్పుడు చక్కని కబుర్లు చెప్పుచుండును. ఎంతయో ప్రేమజూపియుండును. ఏమో? జగన్మోహనరావు బావకు తన్ను పెండ్లి చేసికొనుట అంత యిష్టములేదేమో అని భావించుకొన్నది. ఏది ఎట్లయిన నీయత్త వారు తన కర్మముచే దనకు సంభవించినారని యక్కగారును తల్లియు నెన్ని సారులో యనుకొన్నారు. అది నిశ్చయమని యా బాలకు స్పష్టమై తోచినది.