పుట:Narayana Rao Novel.djvu/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద స రా

177

చేరదామనుకున్నాను. చిన్నతనము గనుక గుండెధైర్య మెక్కువ. దేశానికి పరీక్షలు నెగ్గి సేవచేయడం ఎక్కువవీలు అనే దురభిప్రాయం వదుల్చుకోలేక మళ్ళీ చెన్నపట్నంపోయి ప్రెసిడెన్సీ కాలేజీలో బి. ఏ. ఆనర్సులో చేరాను. 1928 వ ఏప్రిల్‌లో ఆనర్సు ఫిజిక్సులో నెగ్గేటప్పటికి ఇంతలో స్వరాజ్యపార్టీ ప్రాబల్యం ఎక్కువయింది. అందుచే విసుకెత్తి లా కాలేజీలో చేరాను.’

‘కోర్టులు పూర్తిగా విసర్జించాలి అని కదా మీ అసహాయవాదులు బోధించేది. మీరు లా కాలేజీలో చేరా రేమిటి అని ఆశ్చర్యంగావుంది!’

‘ఎవరికన్నా ఆశ్చర్యంగానే ఉంటుంది. నేను న్యాయస్థానాల్లో న్యాయవాదిగా ఉంటానని చెప్పలేను. ఒకవేళ న్యాయవాదినైనా యెంతకాలమో! నా మనస్సు ఇంకా నిర్ధారణ చేసుకోలేదు. మొత్తంమీద నా హృదయానికి పూర్తిగా వ్యతిరేకమయిన కార్యం చేస్తున్నాననిమాత్రం నే నెరుగుదును.’

‘నా మాట విని మీరు నిరాకరణం గిరాకరణం అన్నీ మాని, హైకోర్టు న్యాయవాదిగా చేరి ఏ మునసబీకన్నా ప్రయత్నం చేస్తే నిముషంలో అవుతుంది. అయితే జైల్లో ఎల్లా ఉండేదేమిటండీ?’

‘మొదట వెళ్ళినప్పుడు కొంచెం నాకు భయం వేసింది, ఒక పది నిముషాలు, అన్నీ వదలి వచ్చినందుకు. తర్వాత అలవాటు అయింది.’

‘ఏంపని చేయించారు?’

‘నాబోటివాళ్ళకు నూనెగానుగ, మోట, పిండివిసరటం వేశారు. నేత, తాళ్ళు పేనడం, చాపలు అల్లడం, గొంగళీల నేత మొదలైనవి ఉన్నాయి. తివాసీనేత ఉన్నది. రాజమండ్రి జైల్లో అప్పుడే మోపలాలు వచ్చారు. వాళ్ళనందరిని ఒక డేరాలో కాళ్ళకి కడియాలువేసి, ఒక యినుపమోకు వాటిల్లో నుంచి దూర్చి, కట్టివేసి పశువులకన్న కనాకష్టంగా చూసేవారు.’

‘భోజనం?’

‘మాకు వేరేభోజనం ఏర్పాటు చేయించారు సాంబమూర్తిగారు. సీతారామశాస్త్రిగారు, విల్సనుగారి పదునాలుగు షరతులులాగ, జైలు ముఖ్యాధికారిని పదునాలుగు షరతులు కోరారు. దీపాలు, వ్రాతకు గ్రంథాలు, పాయిఖానా, మూత్రపుదొడ్డులు విడివిడిగా మనుష్యులకు కనబడకుండగా కట్టించడము, భోజనములో పప్పు, కూర, పులుసు విడిగా ఉండడము, నేయి, మజ్జిగలు ఇవ్వడము, తద్దినాలు పెట్టుకోనివ్వడము, నెలకు రెండుత్తరాలు, నెలకో బంధుమిత్ర సందర్శనము, కాళ్ళకు కడియాలు తీసివేయడము, భోజనము హెచ్చించడము మొదలైనవి.’

‘వాళ్ళిచ్చారా?’

‘ఎక్కడిస్తారు! రాజమండ్రిలో రాతకు కలాలు, కాగితాలు ఇచ్చారు. సబ్బులు, కంచాలు, నేయి, మజ్జిగ యిచ్చారు. ఎవరిదీపము వారిని తెచ్చుకో