పుట:Narayana Rao Novel.djvu/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
172
నా రా య ణ రా వు

 నారా: ఒరే! నీ బుర్ర చిదకకొట్టి నిద్దరోగొట్టుతా!

రాజే: ఒరే! నువ్వు చెన్నపట్టణంలో వున్న విద్యార్థిమండలాలన్నిటిలో బలవంతుడవైతే కావచ్చును. త్రోవలో అడ్డంవచ్చిన చంటిపిల్లవాడిమీద పడి సైకిలుమీదనుంచి దిగి, కుఱ్ఱాణ్ణి బెత్తం పుచ్చుకొని చావగొట్టిన యూరోపియను సోల్జరును మెడనొక్కి, గుడ్లు తేలవేయించి, దెబ్బలాటకు రమ్మంటే, వాడు తెల్లబోయి నీకు దండం పెట్టి, క్షమార్పణ అడిగితే అడగవచ్చును. కాని నీ దెబ్బ నాకు నిద్దర తెప్పించగలదురా?

అందరు నవ్వుకొనిరి. నారాయణుడు పండుకొనగనే నిదురపోయెను. పరమేశ్వరుడును, రాజేశ్వరుడును మాట్లాడుచునే యుండిరి. భళ్ళున తెల్లవారినది.

మృదుహృదయుడగు పరమేశ్వరు డనేక సాంత్వనోక్తులతో రాజేశ్వరుని హృదయమునకు శాంతి నొనగూర్చెను.

ప్రేమ ఎవరెఱుంగగలరు? ప్రేమతత్వములో నెన్ని ఛాయలున్నవో? చిత్త కార్తిలో కుక్కలకు కలిగే యిచ్ఛ ప్రేమపదార్థములో నొక కళయే. అందమైన వస్తువు నాసించుట ప్రేమయే. సౌందర్యపిపాసయు ప్రేమలో అంశమే; కరుణ ప్రేమజనితమే. ఆత్మలు రెండు నేకమైపోవుట ప్రేమయొక్క ఉత్తమదశ. ఆత్మనెరిగి పరమాత్మనెరుంగుటకు ప్రేమయొక్క పరమావధి.

‘ఒరే! సర్వవిధాలా నా హృదయం ఆకర్షించి, నాజన్మం సువాసనా లహరిలో ముంచి, నాకు ఉపాస్య అయ్యే బాలికను ప్రేమించడానికి మరి నేను ప్రేమింపబడటానికి ఇన్నాళ్ళు ఎదురుచూస్తున్నాను. నీకున్న ఆశయం చాలా తక్కువది. నీకు చిఱుతపులిలా అందంగా ఉండి డాబుడీబుగావుంటే చాలు, నీమనస్సు ఆకర్షింపబడుతుంది రా రాజీ! నా హృదయం అల్లా సరిపోదు. నాకు కళాపూరితమైన హృదయం కావాలి. కళాపూరితమైన రూపం కావాలి. రెండూ ఎక్కడ సమకూడతాయి! ఒరే రాజీ! నాకట్టి బాలిక సాక్షాత్కరిస్తే నా కామెతో దేహసంబంధమే కావాలని కోరను. నన్ను ‘మగతనం లేనివాడవు’ అను, ఇబ్బంది లేదు. ‘బడాయి’ అను, భయంలేదు. లేదూ ‘దొంగసన్యాసివి, లోకాన్ని మాయ చేస్తున్నావు’ అను, పరవాలేదు. నేను దేహసంబంధం అయిన సంతోషమునూ, పరవశత్వాన్నీ కోరని పవిత్రుడనని చెప్పను. అలా చెపితే దొంగనవుతాను. దేహంమాత్రం అందంగావున్న ఇద్దరు బాలికలతో ఆవేశ పూరితుడనై సంతోషం అనుభవించా. మళ్ళీ వాళ్ళను కోరలేదు. నారాయుడంటి మహానుభావుడు తప్ప ఇంకోడు ‘నేను పరస్త్రీని ఎరుగను’ లేకపోతే ‘కోరను’ అని చెప్పలేడు. చెపితే వట్టి ఝూటామాట అనుకో.’

‘అల్లాంటి సందర్భంలో, రాజీ! ‘రెండురోజుల క్రితం శ్యామసుందరీ చెల్లెలు రోహిణిని చూశానురా! ఆమె నాకన్ని విధాల తగిన పరమపవిత్రురాలు. అందానికి అందమూవుంది. నా ఆశయాలకీ తగింది. నేను కలలోమాత్రం