పుట:Narayana Rao Novel.djvu/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౬ ( 16 )

పు ష్ప శీ ల

రాజేశ్వరరావు బి. ఇ. మూడవతరగతి చదువుచున్నాడు. ఈ యేడాతని చదువు తిన్నని మార్గమున నడుచుటలేదు. తల్లికి జబ్బుచేసినదని వంకబెట్టి రాజమహేంద్రవరము పరుగెత్తిపోయి యచ్చట పుష్పశీల సాంగత్య మెప్పుడు దొరుకునాయని యనేక మార్గముల నన్వేషించుచుండెను. పుష్పశీలయు ననేక చిత్రవిచిత్రమార్గముల దన ప్రియుని గలసికొను నేర్పాటులు సేయుచు నావేళ పరవశురాలై యున్నది. ఆ రోజులలో బుష్పశీల భర్తపై చూపు ననురాగమునకు మితిలేదు. సుబ్బయ్యశాస్త్రిగారును దనరసికతకును భార్యచూపు నపరిమితానురాగమునకును మురిసిపోవుచుండెను.

మిత్రుడగు నొక వైద్యునిచే దన తల్లికి చాల జబ్బుగానున్నట్లు పత్రము నంది, యయ్యది తన కళాశాలాధ్యక్షునకు బంపి, రాజేశ్వరరావు మరి పది రోజులు రాజమండ్రిలో మకాము వేసినాడు. పుష్పశీలాదేవి నొంటిగా గలిసి కొనుటకు వీలు కుదరలేదు. సుబ్బయ్యశాస్త్రిగారి యింటిలోనివారు నమ్మకమైన బంట్లు, యజమాని నిధినిక్షేపములను, వస్తువులను, భార్యను నితరులు తస్కరింపకుండా వేయికన్నుల కాపాడుచుందురు, లంచములకు లొంగరు. మాయమాటలకు కరిగిపోరు.

పుష్పశీల తన హృదయ మితరులకు దెలియనీయకూడదు. ఆమె తన యింటిలోనైన ఏకాంతము సంఘటించవలయును; లేదా, యొంటిగా బయట కెక్కడికైన వెళ్లుటకు వీలుచేసికొనవలయును.

రాజేశ్వరుని కౌగిలింత యొకనాడు రుచిచూచి, ఆనాటి ముద్దుల సువాసనల రుచుల తన పెదవులపై నింకను ఆఘ్రాణించుచున్న దామే. తనయీడు వాడగు రాజి తనకు భర్తయైయున్నచో తన జన్మము తరించియుండును. అహో! తన యౌవన మానాడు రాజేశ్వరుని కౌగిలింతలో రాగాలుపాడుకొన్నది. భర్త తనకెప్పుడు నంత తీపి యీయలేదే; ప్రేమయన నదియే. తాను కూడ నొక నవలలోని కథానాయికవలె నున్నది. తాను రాజేశ్వరుని నిక నెన్నటికి నెడబాయకుండుట ఘటింపదా? రాజేశ్వరుని కలుసుకొనుమార్గమే దొరకదాయె. పదిరోజులు పుట్టింటికేని పంపడు తనభర్త. అయినప్పటికిని పుట్టిల్లు రాజమహేంద్రవరమే కావున నప్పుడప్పుడచటికేగి యచ్చట రాజేశ్వరు నేల కలసికొనగూడదు? అది బాగుగా నున్నది.

ఆ రోజున తన హావభావవిలాసముతో పుష్పశీల భర్తను ప్రేమసాగర లీనుని జేసినది. సుబ్బయ్యశాస్త్రి గారికి బ్రపంచకమంతయు గాఢమధురమై తోచినది... ఆడవాళ్లంత యానంద మియగలరా? వారి జన్మయే యానందము, వారులేని పురుషుని జన్మము మరుభూమియే.