పుట:Narayana Rao Novel.djvu/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

నా రా య ణ రా వు

మరియొక వ్యక్తి జన్మింపలేదు. నేను బాశ్చాత్య గానవిశారదుడగు నొక ఫిడేలు వాదనాకుశలునికడ పాశ్చాత్యుల పోకడలు నేర్చుకొన్నాను. జపాను సంగీతము, బర్మా, సయాము, పెరిశియా, రషియా మొదలగు వివిధదేశముల వాద్య విశేషములు జాగ్రత్తగా విని స్వరముకూర్పు, వేగము, రాగము, తాళము పరిశీలించి కొత్త కొత్త పద్ధతులు రాగములలోనికి, తాళములోనికి, కూర్పులోనికి జొప్పించినాను’ అని నారాయణ ఇంగ్లీషున ఆన్నాడు.

‘యెనిమిదిగంట లయినది. మనము సెలవుపుచ్చుకొందమా’ యని రాజారావు లేచినాడు. తక్కినవారందరు లేచుటయు, నొకరి కొకరు వందనము లాచరించుకొనిరి. నారాయణరావు, రాజారావు, పరమేశ్వరుడు, నటరాజన్ అందరు కారుమీద నెక్కి నెమ్మదిగా సముద్రతీరముననే ప్రయాణము చేయుచు నటనుండి వీధులు తిరిగినారు.

ఎవరిండ్ల వారిని దిగవిడచి నారాయణు డింటికి చేరినాడు. ఆతని హృదయము శ్యామసుందరీదేవిని గనుగొన్నప్పటినుండియు ద్రవించిపోయినది. శ్యామసుందరి తన చెలియలైనట్లు హృదయమున ప్రత్యక్షమైనది. తన కారుగురు చెల్లెళ్ళనుకొన్నాడు. శ్యామసుందరిలో సూర్యకాంతమును జూచినాడు. సూర్యకాంతము తన యప్పచెల్లెళ్ళలో కడుగూర్చు చెలియలు. ఆమె యనిన ప్రాణమే తనకు. నూర్యకాంతము తనలో నొకయంశ, ఈ శ్యామసుందరి తనకు కొంచెము దూరపు చెల్లెలా? అవును, తన యిరువురు చెల్లెళ్ళ వెనుక చెల్లెలు. తన వాత్సల్యమును జూరగొన్నది సూర్యకాంతము. శ్యామకుకూడ నా వాత్సల్యమున నేడు చోటుదొరికినది.

కాని ఎక్కడ దీ సంబంధము! ఏజననాంతర సౌహృదమో ప్రత్యక్షమైనది. తాను తన చిన్నారి భార్యయగు శారదను బ్రేమించుకొన్నాడు. శారద తనదైవము. తన్ను బ్రోవ చనుదెంచిన దివ్యభామిని. ఆమె తన ప్రాణమునకు బ్రాణము. ఆమెను జూచినప్పుడు తన పురుషత్వ ముప్పొంగినది. తనలోని దివ్యత్వము ప్రస్ఫుటితమైనది. ఆమెను కౌగిలించుకొనవలె, ఆమెను బిగియార తనలో జేర్చుకొనవలె. ఆమె పెదవులు అమృతంపు సోనలని తాను కవనమల్లుకొన్నాడు. శారదను జూచినప్పుడు ప్రేమ, దయ, హృదయమున సంగీతము, కపోలముల వేడి, దేహమున మత్తు, ఆత్మకు ఆనందము కలుగును. ఏ స్త్రీయైన దన్నట్లు పులకరమున ఓలలాడించగలదా? తన్నట్లు పొంగింపచేయగలదా? అదియ ప్రేమ కాబోలు, అదియే ప్రణయ మహిమ!

శ్యామసుందరిపై గలిగిన ప్రీతిలో ఆమె దేహము తనకు స్ఫురించదు. ఆమె తనకు చెల్లెలు.

పరమేశ్వరుడు దీర్ఘాలోచనాపరుడై ఇంటిదగ్గర కా రాగినసంగతియు గ్రహించలేదు. ‘ఓ కవీ! కలలోంచి మెలకువ తెచ్చుకోరా’యని నారాయణుడన్నాడు.