పుట:Narayana Rao Novel.djvu/164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
163
అ క్క చె ల్లెం డ్రు

శ్యామ ఇంటికి వచ్చి సంగీతము వినుటకును, నారాయణరావు తన సంగీతము వినిపించుటకును నటరాజనే ఏర్పాటు చేసినాడు.

ఇంతలో రాజారావును బరమేశ్వరుడు నక్కడికి వచ్చిరి. ఈతడు కవి, చిత్రకారకుడు, విమలగానవిలోలుడు. అభినయమునం దారితేరిన కళాహృదయుడు. చిత్రచిత్రమగు విషయముల పాటలుగా గూర్పగలడు. అని పరమేశ్వరుని గూర్చి యెఱింగించిరి. రాజారావు నందరు నెఱింగిన వారే.

సభ యంతట పూర్ణమై పరిమళించినది. నారాయణరావు ఫిడేలు వాయించినాడు. పరమేశ్వరు డభినయముతో, తీపియైన కంఠముతో బాటల బాడినాడు. నటరాజన్ అరవపాటల మధురముగ వినిపించినాడు. శ్యామ, రోహిణి, సరళ, నళిని యందరు వారి వారి కళాచమత్కృతి గనబరచినారు. రాచప్పను, కిట్టప్పను, బాలగంధర్వుని, ఫండేర్కరును అనుకరించుచు మంగేశ్వరరావు తియ్యనిపాట పాడినాడు.

విమలగాంధర్వము వియద్గంగాఝరియై సుళ్లుకట్టుచు, కరుళ్లు వోవుచు, ఫెళ్లున విరుగుచు, పతనములై తూలుచు ఉప్పొంగుచు, ఊగుచు ప్రవహించినది. చిరువాగు లందు కలిసినవి. ఉపనదీనదంబు లందుజేరి త్రివేణులైనవి. శాఖా నదు లందుండి వీడ్వడి వేరుదారుల శాలికేదారముల దడుపబోయినవి.

గానకళారహస్యము లావేళ పూలదోటలైనవి, నక్షత్రకాంతులైనవి, చంటిబిడ్డలనవ్వులైనవి. చక్కని లేబెయ్యగంతులైనవి, సంధ్యాసమయ శ్రీనటేశ్వర పాదకింకిణీతాళములైనవి.

ఒకరినొకరు మెచ్చుకొన్నారు. ఎవరికివారు పరవశులైనారు. ఒకరినొక రానందపరవశుల గావించినారు. లయగతులజూపు వేడుకమై లయావిష్టుడై లయబ్రహ్మను ప్రత్యక్షముచేసినా డానాడు నారాయణుడు. కమాను వేగములో ‘తానం తానం తానం ఆనంతా, నంతానననన, ననాం ననాం నాంనా అనంతా’ యన్న తోడిరాగములోని తానం శ్రీ బాలకృష్ణ పాదనూపుర ఘలం ఘలిత మధురతర మధుగతీవేగమై వారి నందరిని ముంచెత్తినది. అస్పష్ట మధుర సూక్ష్మ స్వరధ్వనులలోనికి గొనిపోయి యణుమాత్రము జేసి, రానురాను విజృంభింపజేసి, బ్రహ్మాండము నావరింపజేసి సమస్తసృష్టిలయముజేసి కమాను ఆపి వేసినాడు. శ్యామసుందరీదేవి పరవశయై చటుక్కునలేచి నారాయణరావునకు నమస్కరించి, ‘అయ్యా! విద్వత్తుమాట యటుండనిండు, ఈ పోకడలు, ఈ స్వకపోలకల్పనాప్రవాహము అద్భుతమైయున్నది. ఈ పద్ధతి ఎక్కడ నేర్చుకున్నారండీ’ యని యడిగినది.

‘అమ్మా! నే నెల్లప్పడు ఫిడేలు వాయించుకొనుచునే ఉంటాను. మన దేశమున ఒక్కొక్క యుత్కృష్టవ్యక్తి జన్మించి, సంగీతాది కళలలో పురాతన సంప్రదాయజనితమగు నొక నూతన సంప్రదాయము నప్పటికి నెలకొల్పి, భవతారకమగునట్లు చేయుచున్నాడు. నేటివరకు త్యాగరాజు ననంతరమున