పుట:Narayana Rao Novel.djvu/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

నా రా య ణ రా వు

ఇండియా కార్యదర్శిగారు అనుమతులిచ్చి దస్కతులు చేస్తే అప్పటికది ‘లా’ అవుతుంది. ఎన్నిచోట్ల పురిటిలో సంధికొట్టవచ్చునో ఆలోచించుకోవయ్యా!’

పర: అందుకనేనండీ మా నారాయుడంటాడు సరియైన స్వరాజ్యం రానంతకాలం ఈ ఫార్సు జరుగుతూనే ఉంటుంది. నిజమైన ప్రజాపరిపాలన కవకాశంగల స్వతంత్రం ఉంటే చాలు. దాన్ని మనం ప్రజాస్వామికం (రిపబ్లికు) అన్నాసరే, వలసరాజ్య పరిపాలనావిధానము (డొమినియన్ స్టేటస్) అన్నా సరేనటండి.

జమీందారు: అంతవరకు మనం ఏమి మాట్లాడకుండా ఊరుకుంటే ప్రభుత్వం పెచ్చుమీరిపోదండీ? కాబట్టి గడబిడ చేస్తుంటే కొంతవరకయినా లాభం ఉంటుందా ఉండదా?

నారా: ఉండదని కాదండి; ఆ లాభం, అసలు భూమిరావలసి వ్యాజ్యాలు జరుగుతూంటే వరి ఊడ్చలేదు, వరిలో కిచిడీసాంబా ఊడ్చలేదు అని దెబ్బలాడితే వచ్చేలాభంలా ఉంటుందండి. వ్యాజ్యదార్లకు వాజ్యం ఆలస్యమయినకొద్దీ ఫలసాయం నష్టం. ఒకవేళ ఫలసాయానికి ఖర్చులకు డిక్రీ అయినా అవి వసూలు అవుతాయని వ్యాజ్యదారుకు ధైర్యం ఎల్లా ఉండకూడదో అంతే మనస్థితి అవుతుంది. దేశం అప్పులు ఎక్కువవుతున్నాయంటున్నాము. ప్రభుత్వంవా రిదివరకు చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతూ వుంది. కొత్తఋణాలు చేస్తున్నారు. మనం ప్రభుత్వంతో ఇప్పుడైనా రాజీపడితే ఈ పన్నులన్నీ బ్రిటిషు ప్రభుత్వంపైన రుద్దడానికి, ధర్మం ఎల్లా వున్నా, వ్యవహారంవల్ల వీల్లేకుండా చేస్తున్న వీ సభలు. అప్పుడు మనకు నష్టం కాబట్టే యావన్మందీకలిసి యేదో ఒక స్వతంత్రతకు, ఏక తాటిమిద పని చేస్తే నిమిషంలో ప్రభుత్వంవారు రాజీకి చక్కా వస్తారు, అంటుంది కాంగ్రెసు.

జమీం: అవును, మన ఆశయాలు చాలా గొప్పగానే ఉంటాయి, నారాయణరావూ! కాని మానవప్రకృతికూడా మనం ఆలోచించాలి. ఒక్క చిన్న కుటుంబంలో నలుగు రన్నదమ్ములకు నాలుగు భావాలుండి నాల్గుమార్గాల వెళ్తారుగదా? అటువంటప్పుడు ముప్పదిమూడుకోట్ల జనంవున్న మనరాజ్యంలో మూడుకోట్ల భావాలైనా వుంటాయి. అందుకని దారులు రకరకాలుగావున్నా ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి’ అన్నట్లుగా అందరూ కలిసి ఒక చోటికే వెడుతున్నాం గనుక మన గమ్యస్థానం చేరుకోవచ్చును. అట్లాకాక ఒక పక్షంవారు తదితరులు అంతా తమపక్షమే చేరాలని మూర్ఖపు పట్టుపట్టి కూచుంటే అసలు మనప్రయాణానికి అడ్డంరాదా అని నేననేది.

నారా: చిత్తం. మీరు చెప్పింది నేను కాదనను. మహాత్మాగాంధిగారు మూర్ఖపుపట్టు పట్టినాడని మనం అనుకోడానికి సావకాశం లేదని నా మనవి. ఎందుకంటారా, పెద్ద జబ్బులకు పెద్దరకం మందులు, గట్టిరకం వైద్యం కావాలి. సర్వతోముఖం అయిన జ్ఞానం కలిగిన గొప్ప వైద్యుడు జబ్బుకు