పుట:Narayana Rao Novel.djvu/153

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
152
నా రా య ణ రా వు


కుమారరాజా కేశవచంద్రరావునకు సంగీతమన్న చిన్నతనమునుండియు నిష్టమే. శారదకు పాఠము పూర్తిగా వచ్చినరోజున మరల నాఖరుపరీక్ష చేయునప్పు డాడింభకు డెట్లు గ్రహించునో సంగీతపు గదిలోనికి చల్లగావచ్చి కూర్చుండును. పాటయంతయు నగువర కచ్చటనుండి యమందానంద మొందును. తరువాత నొక్కనిముసమైన నచ్చట నుండడు.

ఆ రోజున నదివరకు బూర్తిగావచ్చిన కృతి బాడునప్పు డా గదిలో కూర్చుండి, కొత్తపాఠము మొదలుపెట్టుటతోడనే యచ్చటినుండి కేశవ చంద్రుడు విసవిస వెడిలిపోయి ‘రాముడూ!’ అని కేక వేసెను.

‘చిన్నబాబుగారు పిలుస్తున్నారు!’ అని కేశవచంద్రు నాడించు సేవకుడు పరువిడివచ్చినాడు.

బ్రాహ్మణ జమీందారు నింట నెవ్వరైనసరే సేవకులుగా నియమింపబడుదురు. కాని వెలమ, క్షత్రియ, కాపు, కమ్మ జమీందారుల యిండ్ల దాసీలు, కాసాలు వంశపారంపర్యముగా సేవజేయుచునుందురు. జమీందారులను వారి సేవకులు ‘బాబు’ లనియు గుమారరాజులను ‘చిన్న బాబు’ లనియు బిలుచుచుందురు.

జమీందారు బిడ్డలగుటయే గారాము, అందులో లేక లేక జనించిన బిడ్డడగుటచే సేవకులందరు నాతని కనుసన్నల మెలగుచుందురు. బాలకుని యేడువనీయకూడదు. బాలకు డాడుకొనుటకు వలయు సామాను లనేకము లున్నవి. నడుపుటకు రైళ్ళు, మోటార్లు, ట్రాములు, ఇంజనులు, బొమ్మలు మొదలగు నాటవస్తువు లెన్నియేని యున్నవి.

కేశవచంద్రుడు బాలకుడయ్యు మితభాషి, పలికిన రెండు పలుకులు ముద్దు లొలుకును. ఒకసారి యీడుకుంమించిన గాంభీర్యము వహించి మిన్నకుండును.

తల్లి యాతని కొకప్పుడు శ్రీకృష్ణునివలె వేషమువేయును, ఒకనాడు అక్బరుపాదుషావలె వేషమువేయును, ఒకనాడు జార్జిచక్రవర్తి వేషము వేయును.


౧౩ ( 13 )

శా స న స భ


జమీందారుగారు చెన్నపట్టణము శాసనసభ సమావేశమునకై వెడలినారు. రైలుకడ కెదురువచ్చిన యల్లుని గుశలమడిగి యేదియేని విషయముల మాట్లాడుకొనుచు నింటికి బోయినారు. లా కాలేజీ యొంటిగంటకు మూసివేసెదరు కాన వీలయినచో దానొక పర్యాయము సమావేశమునకు వచ్చెదనని నారాయణరావు మామగారితో జెప్పినాడు.