పుట:Narayana Rao Novel.djvu/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
151
కే శ వ చం ద్ర రా వు


సారంగి భరతదేశమునకు ప్రథమమున క్రీ.వె. నయిదాఱు శతాబ్దులలో వచ్చినది. పదునెనిమిదవ శతాబ్దిలో ఫ్రాన్‌సు వర్తకులు ఫిడేలు తీసికొనివచ్చినారు. పందొమ్మిదవ శతాబ్ది కది భారతదేశమున ముఖ్యములగు సంగీతవాద్యము లలో నొక్కటియైనది. ఆనాటినుండియు నీ వాద్యము తన వాద్యముగా, గాత్రమునకు వీణకు అనుకరణవాద్యముగా, విజృంభించి, యార్యసంప్రదాయ వాద్యమై పురాతనమైన వేణు వీణావాద్యముల కనుంగు చెలియలైనది.

ఆంధ్రదేశమున నీ వాద్యము నెక్కువ నాట్యవిద్యాపారంగతులగు గణికల నాట్యమున కనుకరణముగా నుపయోగించినారు. పండితులును దీనిని మహావాద్యములలో నొకదానిగా నంగీకరించిన నాటినుండియు దక్షిణాపథమున గోవిందస్వామి పిళ్లయు, చౌడప్పయు, నాంధ్రమున కోటయ్యగారు, వారణాసి బ్రహ్మయ్య, బలరామయ్యగారలు, హరి నాగభూషణముగారు, ద్వారం వెంకటస్వామినాయుడుగారు నీ వాద్యమున కుత్కృష్టత సముపార్జించి పేరెన్నికనొందిరి. ఇంకను దక్షిణాపథమున, వాద్యముగ ఫిడేలు నానాటికి విజృంభించిపోవుచు, పాశ్చాత్య విద్వాంసులగు సొనానిని మొదలగు వారి వాద్యముతో దులదూగుటకు సిద్ధులగు పండితుల గననున్నది. జపాను దేశమునను నీ వాద్యము పరమవాద్యమైనది. హాలండు మొదలగు పాశ్చాత్య దేశములతో సమానమై, ప్రపంచమునకెల్ల నుత్కృష్టమగు నొకటి రెండు ఫిడేళ్లతో సమానమగు నైదో, యారో ఫిడేళ్లను జపాను సృజించుకొనినది.

శ్రీరామయ్యగారు ఫిడేలులో నసాధారణ ప్రజ్ఞ కలవారు. గాత్రము నందును బండితుడు. సంగీతపాఠములు శిష్యురాండ్రకు జెప్పి వారిని బ్రజ్ఞావంతుల జేయుటలో నమిత చాతుర్యముగలవారు. గానవిద్యాప్రవీణులగు పండితులందరు నధ్యాపనమున సమర్థులుగారు. ఉపాధ్యాయునకు బూర్ణ హృదయ ముండవలయును. దీక్ష్ణమగు మనస్సుండవలయును. శిష్యుని హృదయము, మనస్సు గ్రహించు తేజశ్శక్తి యుండవలయును. లేనిచో గురువెంత విద్యాపారంగతుడైనను శిష్యునికి విద్య రానేరదు. అతని విద్య లోహపేటికాంతర్నిగూఢ గుప్తధనమువంటిదే. ఎమ్. ఎస్ సి., డి. ఎస్ సి. మొదలగు మహోన్నత పరీక్షలలో నుత్తములుగా గృతార్థులైన మహానుభావులు కొందరు శిష్యులకడ నోరు విప్పలేరు.

శ్రీరామయ్యగారు పవిత్రహృదయుడగుటచే గొందరివలెగాక, తన విద్య పూర్ణముగా, శక్తిగల శిష్యుల కీయ సంకల్పించినారు. అట్టి మహానుభావునికడ విద్య నేర్చుకొనుటకు శారద యేమినోము నోచుకొన్నదో యని జమీందారుగారు పరమానందము నందుచుందురు.

ఆ రోజున శ్రీరామయ్యగారు శిష్యురాలికి ‘ఎందరో మహానుభావు’ లను త్యాగరాజకృతి నేర్ప సంకల్పించినారు.