పుట:Narayana Rao Novel.djvu/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
150
నా రా య ణ రా వు


‘బావ బండవాడుకాడు! మంచివాడు. నాకు కథలు చెప్తాడు, ఇంకా ఎన్నో సంగతులు చెప్తాడు. బావ అక్కయ్యకన్న బాగా సంగీతము వాయిస్తాడు ఫిడేలుమీద.’

తల్లి తెల్లబోయి కుమారునికి జవాబు చెప్పకుండ వెళ్ళిపోయినది.

అతని చిన్న హృదయములో, దన బావగారిని దండ్రిదక్క తక్కిన యందరు హేళనజేయుచున్నారని యస్పష్టముగా దోచినది. నే డా బాలకుడు, శారదయు జగన్మోహనరావు మాట్లాడుట చూడగనే, అతని హృదయమున జిరుకోపము వచ్చినది. జగన్మోహను డాతని జూచి ‘ఏమండో కుమారరాజా బావగారు! నీ పుస్తకాలన్నీ ఏవోయి?’

‘లేవు. ఎక్కడో ఉన్నాయి.’

‘కోపం వచ్చిందా బావా?’

‘రాలేదు.’

‘మరి కోపంగా ఉన్నట్లున్నావే బావా?’

‘అబ్బా! నాకు పనివుంది. ఒరే రాముడూ!’

‘బాబు!’ అని నౌకరు రాముడు లోనికివచ్చినాడు. ఎత్తుకోమని కేశవచంద్రుడు చేతులు జాచుటయు, సేవకుడు రాముడా బాలు నెత్తుకొని బయటికి వెళ్ళెను. శారదయు లోనికిబోయినది.

జగన్మోహనుడట్లే యాసోఫాపై నధివసించియుండి, శారదావిగ్రహమును తలపోసికొనుచు కూరుచుండెను. ఇంకను జిన్నపిల్ల. శారద వైఖరిజూడ భర్తను ప్రేమించుటలేదని తోచుచున్నది. తన మేనత్తయు నల్లుని పూర్తిగా రోయుచున్నది. తెలిసియో తెలియకయో తనకు మేనత్త సహాయము చేయునట్లే యున్నది. కొంచెము బాగుగా పాచిక పారించినచో శారద యవలీలగ దన గౌగిలింతకు జేరును. ఈ సంగతి యితరులకు దెలిసినచో నెవరేమిచేయగలరు?

శారద యింటిలోనికిబోయి, సంగీతపు గదిలో తన గురువుగారు శ్రీరామయ్య గారు వచ్చియుండుటచే, ఫిడేలు తీసి సవరించుకొని కమానుకు రజను రాచి తీగలపై ‘ససరిరి’ యని ప్రసరింపజేసెను.

శారదాదేవి ఫిడేలును, తండ్రిగారు తమ స్నేహితుడొకడు యూరపు ఖండముపోవుచుండ, హాలండునుంచి తెప్పించినారు. ఫిడేలువాద్య మరబ్బులది. అది సారంగికి సంబంధించినది. అచ్చటనుండి యరబ్బుల ప్రభుత్వము పాశ్చాత్య దేశములకు దన తేజస్సును బరపినపుడు ఫిడేలును ఫ్రాన్‌సు సృజించినది. పాశ్చాత్యదేశమే దాని జన్మభూమి యనునంతవరకు బెంపొందింపబడినది. ముఖ్యముగా ఫ్రాన్‌సు, ఇటలీ, జర్మనీ, హాలండు దేశములలో ఫిడేళ్ళ నద్భుతముగ నిర్మించెదరు. కొన్ని కొన్ని ఫిడేళ్లు యేబదివేల రూప్యములు ఖరీదుగలవి యున్నవి. వానిలోని శ్రుతిధ్వను లతిసున్నితములు, నపరిమితమధురములు, నత్యంత గంభీరములై అతి సూక్ష్మములై యుండునట.