పుట:Narayana Rao Novel.djvu/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

నా రా య ణ రా వు


ఈ బాలిక , యీ జగన్మోహిని, తన రాణి కావలసిన యీ శారద, నొక పందికి నంటగట్టినారు. ఈ బాలికయే తన భార్య యైయుండిన దా నింగ్లండు దీసికొని వెళ్ళియుండును. ఆమెను పువ్వులలో బెట్టికొని పూజించువాడే. జమీందారిణియన్న నీమెయే. ఇంత అందకత్తె యగునని యెఱిగియున్నచో, నీ వివాహము చెడగొట్టియుందునే! అనేక మార్గము లున్నవే! అప్పుడు తన మేనత్త భర్త యేమిచేయును? తుదకు దనకీయక తప్పెడిదికాదు. తన స్నేహితురాండ్రగు యూరేషియను బాలికలు, వేశ్యాసుందరులు శారద ముందర గ్యాస్ దీపం ముందర, హరికేన్ దీపాలే.

ఆమెను జూచి లోలో గుటకలు మ్రింగినాడు. అనతిస్ఫుటమైన స్నిగ్ధమైన యామె యవయవ విలాసము నా వలిపపు పయ్యెద పావడలలో నాలోకించి మురిసినాడు. ఏదియో వంకతో శారదతో మాట్లాడును. ఆమెతో గూర్చుండి యుండును. యామెను ముట్టుకొనుచుండును.

అతని యాందోళనమునకు శాంతి యాతని మేనత్త సమకూర్చినది. వరదకామేశ్వరీదేవికి మేనల్లుడన పరమప్రీతి. హృదయాంతరాళమున తన బిడ్డలపై నెంత ప్రేమ యున్నను తన కుమారునికన్న, తన కుమార్తెలకన్న మేనల్లునామె యాదరముమై గాంచును.

‘ఏమయ్యా మోహనం! వదినగారు విశాఖపట్టణంలో యున్నారా? నువ్వు చెన్నపట్టణం వెడుతున్నావా? అత్తయ్య అంటే ప్రేమగనుక పాపం, యిక్కడ దిగావు. ఎన్ని సారులు చెన్నపట్నం వెడుతూ ఇక్కడ దిగకుండా వెళ్లలేదు?’

‘ఏమిటో అత్తా! పనితొందరలు. నేనూ మామయ్యగారికిమల్లే మా జిల్లానుంచి శాసనసభ సభ్యుడుగా వెడదామని ప్రయత్నం. ఏమవుతుందో! అందుకనే ఇప్పుడు చెన్నపట్నం వెడుతున్నాను. అయినా నిన్నూ శారదను చూడాలని దిగాను. శారద అందాలరాశి అవుతూంది అత్తయ్యా.’

వరదకామేశ్వరీదేవి: ఏమిటో! ఇంతకూ నీ భార్య కావలసిన బంగారు తల్లికి యిలారాసిపెట్టి ఉంది. మీ యిద్దరికీ ఎంత యీడూ జోడుగా ఉండేది! సర్వవిధాలా మీ ఇద్దరూ తగివుందురు. నాకన్నులున్నూ ఆనందం పొందుతూ ఉండును. నీ అందానికి మా శారద సాటి. మా శారద అందానికి నీ అందం సాటి. మన్మథుడూ, రతీదేవిలా వెలిగిపోతూ ఉండేవారు. ఒకరి తాహత్తు కొకరు సరిపోతారు. మీ మామయ్యగారి ఉద్దేశం నాకు బోధపడలేదు. కాకి ముక్కుకు దొండపండు కట్టారు. మా అల్లుణ్ణి చూస్తే నాకు ....

జగ: అల్లా అనకు అత్తా! అతగా డేం తక్కువ అందమైనవాడా యేమిటి!

వర: ఆ! ఆ అందం! పెద్ద రాక్షసుడు.

జగ: శారద దేవకన్యలా ఉంటుంది.