పుట:Narayana Rao Novel.djvu/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వి ష బీ జ ము లు

145

నారాయుడూ వాళ్ళూ చెప్పడం పూర్వం హిందూదేశములో బోల్షవిజము లాంటి ఉత్కృష్ట రాజ్యపద్ధతి ఉండేదిట. ఎంతవరకు నిజమోకాని ఈరోజున డబ్బువదిలే మహానుభావుడెవరు, గాంధీమహాత్ముడంటివాళ్లు ఏ పదిమందో?

౧౧ ( 11 )

విషబీజములు

శారద దినదిన ప్రవర్థమానయగుచున్నది. ఆమె సౌందర్యము ఇంకను సౌందర్యముల బ్రోవుచేయుచు జగన్మోహనమగుచున్నది.

తన యంద మామె యెఱుగును. ఇంక అందగత్తెనగుదునని యామె గ్రహించినది. అందము తన్ను వీడియుండకూడదు. ఉదయమున నిదుర లేచినది మొదలు మరల రాత్రి నిదురగూరువర కామెకు దాను సౌందర్యవతినన్న చైతన్యముండును. సంగీతము నేర్చుకొనునప్పుడు, పాఠములు చదువుకొనునప్పుడు, బజారులో కారుమీద పోవునప్పుడు, భోజనమప్పు డామె యితరులు తనయంద మెటుల చూచుచున్నారోయని పరికించుచుండును. ఏమనుష్యుడైన తన్ను తేరిపారజూచిన నామె హృదయము హాయియనును.

‘పరపురుషుడు, శీలము’ అను వాక్యములయర్థ మా బాల కింకను గోచరింపలేదు. ఆ వయస్సులో నేబాలకును వానియర్థము తెలియదు. వారి హృదయముల నింకను స్త్రీ, పురుషుల పరమరహస్యవర్తనపుం బులకరము లొదవవు. వారి హృదయములో కోర్కె, విరియు మొగ్గలో ప్రత్యక్షమగు చిరుపరిమళము బోలియుండును. రానున్న స్త్రీత్వ మా వయస్సులో సౌందర్య బోధమాత్రమై యుండును.

దసరా పండుగలకు నత్తవారందరు వచ్చెదరని యామె విన్నది. అత్తవారిట్లు మాటిమాటికి వచ్చుచుండుట యామెకు సమ్మతముగా లేదు, డబ్బులేక వచ్చుచున్నారని కాదు గాని, యేదో వంక బెట్టి జమీందారులయింటికి దఱచు వచ్చుచున్నారా? అయినచో దన యత్తగా రొక్కపర్యాయమే దమయింటికి వచ్చినది. తన మామగారు అసలు రాలేదు. తన యత్తవారింటి లోను దర్జాగానే యున్నది. తమ తోటకన్న వారితోట బాగున్నది.

ఏది యెట్లున్నను శారద కత్తింటివారిపై ప్రేమ కుదరలేదు. కావుననే చెన్నపట్నము వెళ్ళుచు రాజమహేంద్రవరములో దిగిన జగన్మోహనరావుతో శారద విరగబడి నవ్వుచు, గృహప్రవేశమునకు దాను వెళ్లినప్పుడు కొత్తపేటలో నడచిన యపహాస్యపు బనులెల్ల వర్ణించి చెప్పినది.

జగన్మోహనుడు సౌందర్యరాశియగు మేనమరదలిని జూచినాడు, విస్తుపోయినాడు. పెద్దమనిషి అయినదని విన్నాడు. ‘యౌవనోదయమాత్రమున నాడువారిలో నెట్టి విచిత్రమైన మార్పులు వచ్చును’ అని యాతడనుకొన్నాడు.