పుట:Narayana Rao Novel.djvu/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

నా రా య ణ రా వు

ఇరవైచాలు, వాయిదాలు పది. వడ్డీ మామూలు అర్ధరూపాయి. కావలిస్తే యింకో పదిహేనువందలు పుచ్చుకో.'

‘వద్దండి బావయ్య గారు, నేను చేసిన అప్పు నేనే తీర్చివెయ్యాలండి. మీ అప్పుతప్ప నేనింకో అప్పు చెయ్యలేదు. మీ దగ్గిరతప్ప నే నింకోళ్ళదగ్గిర తేను.’

తనఖాపత్రము వ్రాయుటకు ముహూర్త మేర్పరచుకొని వసంతయ్య వెళ్ళిపోయినాడు.

సుబ్బారాయుడు గారు దినదినము ఏ పొలమునకోపోవు నలవాటు కావున నా సాయంతనము వసంతయ్యను బంపి, లోనికేగి కండువా వేసికొని, మంచి లంకాకుచుట్ట వెలిగించుకొని, చేత వెండిపొన్ను కఱ్ఱ బుచ్చుకొని, కిఱ్ఱు చెప్పుల జోళ్లు కిఱ్ఱుమని చప్పడు చేయుచుండ గొందరు పాలేళ్లు, కొలగాండ్రు, నిరువురు కాపు స్నేహితులు, ఒక క్షత్రియరైతు కూడరా, గాలువ యవ్వలి పొలము జూచుకొనబోయెను.

సుబ్బారాయుడు గారి కనుదినము పొలము లొకసారి తొక్కివచ్చుట యలవాటు. ఒకప్పుడు తోటల జూచుటకై పోవును. ఏ పొల మెట్లున్న దనియు గమనించుచుండును. వంగతోటలు, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మిర్చి, పసుపు వారి మెరకపొలములలో విరిగా బండును.

చీకటిపడువరకు నాయన బొలముల దిరిగిదిరిగి దీపములు పెట్టిన వెనుక నింటికేగును. ఇంటికి వచ్చుతోడనే మంగలి కాళ్ళుబట్టును. అటు వెనుక చలికాలమయిన వేడినీళ్లు, తదిర కాలములలో జన్నీళ్లు నింటిలో నెవరో యొకరు తోడిపెట్ట స్నానమాడి, సంధ్యావందన మాచరించుకొనును.

సుబ్బారాయుడి గారి హృదయమున రషియను బోల్షవిక్కుల రాజ్యతత్వము మెరుపువలె తోచినది. ప్రపంచమున నెంతకాలము ‘ఆస్తులు’ నా డబ్బు, నా పొలము అని అనుకోగలరు? డబ్బు లేని వాళ్ళు, ఆస్తిలేనివాళ్ళు ఎక్కువమంది ఉన్నారుకదా! వాళ్ళు తలుచుకుంటే డబ్బుగలవాళ్లు ఎక్కడ ఉంటారు? ఈ సైన్యాలన్నీ అడ్డుపడాలికాని, మనుష్యుడెంత విచిత్రమైన హృదయం కలవాడు. ఒక్క రష్యాలో తప్ప ఎక్కడైనా సైన్యం, ప్రజలూ తిరగబడ్డారా? తక్కిన రాజ్యాలలో రాజుల్ని తీసి వేసినప్పుడు తిరగబడ్డవాళ్లు రాజు క్రింద రాజుని ఆడించే ప్రభువులో, లేకపోతే కోటీశ్వరులో కాని, సైన్యాలు అనగా తక్కువ జీతం పుచ్చుకొనేవాళ్లు తిరగబడలేదు. అంటే ఇంతకూ డబ్బులో ఒక విధమైన సమ్మోహన శక్తి ఉంది. డబ్బుగలవాణ్ణి చూస్తే మామూలు మనుష్యుడెంతో భయపడిపోతాడు, కాలూ చేయీ కదపలేడు. రష్యాలో మరీ విపరీతమైన స్థితి ఉండాలి. లేకపోతే అల్లా ప్రజలు అంటే బీదవాళ్ళు తిరగబడివుండరు అని యాలోచనాపథగామియై సుబ్బారాయుడు గారు భోజనము చేయుచుండెను.