పుట:Narayana Rao Novel.djvu/144

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
143
పా లే రు

వింకోటి లేకుండావుంది. పూర్వం చదువు యొక్క లోపలివిలువ ఎక్కువ. ఇప్పుడు పైవిలువ ఇంటిని గుండం వేసి గోదావరిలో కలిపి దిబ్బ చేసే ఖరీదు. జీతాలునాతాలు, పుస్తకాలు, హోటళ్లు, కాఫీహోటళ్లు ఇంటి నుంచి కుఱ్ఱాడు చదువుకునే ఊరికి డబ్బు కాల్వకట్టాలిసిందే. ఈ చదువుకి ఇంతా తగలేసి దానికి వడ్డీ తీసుకురాగలడా? ఇక ముందూ? ఇంకా కొంచెం మీ బ్రాహ్మణేతరులలో ప్రస్తుతం చదువులవల్ల లాభం ఉండవచ్చులే. కానీ ముందుముందు ఈ చదువులు మన కొంపలు తీసే చదువులనీ, ఉద్యోగంకోసం చదివించడం అంత తెలివితక్కువ ఇంకోటి లేదనిన్నీ మనకు పూర్తిగా తెలుస్తుంది. అందుకని వ్యవసాయాన్నే నమ్ముకుందామా అంటే నష్టం నష్టం నష్టం.’

‘నామట్టుకు నేను ముప్పయి యకరములభూమి వ్యవసాయం చేస్తున్నాను. నాలుగువందల ఏబది పైచిలుకు వస్తాయి బస్తాలు. పన్నులకు మామూళ్లకి ఎనభై బస్తాలు పోతాయి. పాలేళ్లకు, దూళ్లకి, కూలికి, విత్తనాలకి అన్నిటికి ఇంకోనూరు బస్తాలు పోతే యింక మిగిలే రెండువందల ఎనభై బస్తాలలో తిండికి మాకుటుంబానికి ధాన్యంమట్టుకు యాభైబస్తాలు పోతాయండి. ఇంకున్న రెండు వందల ముప్పయి బస్తాలకువచ్చే పదమూడువందల ఎనభైరూపాయలూ ఏడాదికి గడవాలి. దీంట్లోనే చదువులు, దీంట్లోనే గుడ్డలు. రామ రామా! బావయ్య గారు, ఆడవాళ్ళ గుడ్డలకి చాలవండీ మనపంటలు.’

‘అంతటితో అయింది! మఱి వ్యాజ్యాలు వల్లకాళ్ళు, కక్షలతో క్రిమినలు కేసులు, కౌళ్లుకదపాలకు రిజిష్టర్లు, అమ్మకాలకు రిజిష్టర్లు, రిజిష్టరీఖర్చులు, లంచాలు, పురుళ్ళు పుణ్యాలు, రైళ్లు, మోటార్లు - ఎన్నని? ఈ లోపుగా ఏ పెళ్ళో వచ్చిందా, యిక దానితో ముంపేకదా.’

‘బావయ్యగారు అదేనండి. మా మూడోఅమ్మాయి పెళ్ళిఖర్చువచ్చి నెత్తిన కూర్చుందండి. ఇదివరకు చేసిన పెళ్ళిళ్ళకి వాటికి కష్టపడితీర్చానండి. మీకివ్వవలసిన నోటు బాకీ పదిహేను వందలు, ఈ పెళ్లికి కట్నంవగైరా ఖర్చులు, అంతా నలభై వందలు కావాలండి.’

‘సంబంధం ఎక్కడిదోయి?’

‘పూళ్ళండి. డబ్బు నిలవవుందండి, కొండ్రా ఉందిట కొంచెం. కుఱ్ఱవాడు మా వాడితోపాటు రాజమహేంద్రవరంలో చదువుతున్నాట్టండి. కట్నం నాలుగు వేలు, లాంఛనాలు పదిహేనువందలు.’

‘పెళ్ళిఖర్చులు రెండువేలు. నాలుగువేల అయిదువంద లేమి సరిపోతాయోయి?’

‘ఇంటిదగ్గర బాకీ తీర్చడానికి ఉంచిన పదిహేనువంద లున్నాయండి. మా యింటావిడ వెయ్యరూపాయ లిచ్చింది.’

‘పెద్ద రైతువు. నీకున్న ముప్పై యకరాలు నాకు తనఖా అక్కర లేదు.