పుట:Narayana Rao Novel.djvu/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పా లే ర్లు

141

సుబ్బారాయుడు గారు దేశమున జరుగు విషయముల నన్నింటి నప్పటి కప్పుడు కనుగొనుచునే యుండిరి. ఆంధ్ర, కృష్ణాప్రత్రికల నాయన చదివెడు వారు. ఆంధ్రదేశమున నేపత్రిక వెల్వడినను, దానిని సుబ్బారాయుడు గారు తెప్పించవలసినదే. ఆంధ్రప్రకాశిక తెప్పించినారు, మనోరమ తెప్పించినారు. ఆంధ్రభాషాభివర్ధనీ సమాజమునకు, విజ్ఞానచంద్రికా మండలికి నింక ననేక గ్రంథ ప్రచురణ సంఘములకు సుబ్బారాయుడుగారు చందాదారు. అన్ని గ్రంథములను బరిశీలనాపూర్వకముగ జదివి ఆయన మనన మొనర్చుచుండును, ఆయన సేకరించిన గ్రంథాలు బదివేలవరకు నున్నవి. ఆవి తనగుమాస్తాచే వరుస నేర్పరిచి సంఖ్య నియమించి గ్రంథాలయము చేసినారు. ప్రపంచమున యేయే దేశముల నేయే పంటలు పండునో వాని కనువగు పరిస్థితులేవో తెలిసికొనుటకు, ఆయన భూగోళ పాఠ్యగ్రంథములు పరిశీలించినారు. కావుననే పాశ్చాత్య విద్యలో గడిదేరిన నారాయణరావు, శ్రీరామమూర్తులుగూడ సుబ్బారాయుడు గారు తమలో జర్చచేయుచు చూపు వివిధ విషయజ్ఞానమునకు నచ్చెరువందు వారు. నారాయణరావుచే నాయన ఇంగ్లీషులోనున్న అర్థశాస్త్ర గ్రంథముల జదివించుకొని యర్థము చెప్పించుకొని అతనితో నాయావిషయములు విపులముగ చర్చించి యర్థముజేసికొన్నారు. ఆయా దేశములందు భూములపై రాబడి యెంత యైనది, పన్నుల మొత్త మెంతయైనది, పన్నులకు రాబడికి గల సంబంధమేమో విపులముగ జర్చచేసినారు.

భరతదేశమున నన్నిటి ఖరీదులతోపాటు భూమి ఖరీదులును బాగుగానున్నవి. యుద్ధము మొదలిడిన నాటినుండి ఖరీదులు మఱియు పెరిగిపోయినవి. భూమి ఖరీదులు బాగుగా నున్నవని ప్రజలు అధికవ్యయము సేయ నారంభించినారు. అధికవ్యయ కారణమున నప్పులు పెరిగిపోతున్నవి. సుబ్బారాయుడుగారు దేశ మెక్కడకు బోవుచున్నదో యని యనుకొన్నారు. వడ్డీ విపరీతము, మారువాడీలు, దేశములోని షాహుకార్లు, నూటికి నెలకు మూడు నాలుగు రూపాయల వడ్డీ పుచ్చుకొనుచుండిరి. అర్ధరూపాయి, తప్పిన బదియణాలుకన్న నెక్కువ పుచ్చుకొననని యాయన ప్రతిజ్ఞ. ఆప్పు పుచ్చుకొనునప్పుడే షాహుకారు కమిషనట. నూరురూపాయలు పుచ్చుకొనువాడు నిజముగా పుచ్చుకొన్నది తొంబదియైదే. తక్కిన యయిదు కమిషను. అదిగాక గుమాస్తాలకు మామూలు, దేవుడికి ధర్మానికి మామూలు. పుచ్చుకొన్న నిముషమునుంచీ వడ్డీ పంజాబు మెయిలు వేగముతో, వాయువేగముతో, మనోవేగముతో పెరిగిపోవు చుండును.

‘అబ్బాయి, యీధరలున్నాయా! యీ దేశానికి తగ్గనిధరలు. మాయ యుద్ధం ఎక్కడనుంచి వచ్చిందో ప్రపంచం అంతటా ధరలు పెంచేసింది. పోనీ మనవాళ్లు యీ పదేళ్ళు కాస్త జాగ్రత్తపడి ఋణాలు పణాలు తీర్చుకొని వెనకటివలెనే జీవనం చేసుకుంటూవుంటే రైతుకు పదిరాళ్లు వెనకబడి ఉండేవి. నువ్వు నాదగ్గరకు అప్పుకువచ్చావు. నువ్వు ఈధరలలో అప్పుతీర్చడం