పుట:Narayana Rao Novel.djvu/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యూరేషియను సాంగత్యము

133

బ్రభుత్వమువారిచేతికి వచ్చి ప్రభుత్వము ప్రజారాజ్యమైనచో మన గతియేమి? ఇప్పటికి రైళ్ళకంపెనీలలో భారతీయు లెక్కువగా నియమింపబడవలయునని సంచలనము కలిగినది’ అని చెప్పినాడు గిడ్నీ జ్ఞాపకమున్నదా?’ యని రొజారియో వాక్రుచ్చినారు.

జగన్మోహనుడు: అవునండి. కాని యూరేషియనులు సర్వవిధముల యూరపియనులతో సమానము. వారి సంతతియే అయినప్పు డేల యూరేషియనులకు భయముండవలయునో నాకు గ్రాహ్యమగుట లేదు.

రోజారియోసతి: మన దేశ మింగ్లాండుదేశము. ఎప్పటికైనా మన మక్కడకు వెళ్ళవలసిన వారమే. పాపం! ఇంగ్లీషు ప్రముఖుడొకడు సెలవిచ్చిన సంగతి నీవు వినలేదు. ‘అటు ఇంగ్లీషువారికి, ఇటు హిందూ దేశస్థులకు గూడ కాక యూరేషియనులు రెంటికీ చెడిన రేవడలైపోయినారు’ అని.

జగ: మీరంత యనవసరముగా భయపడుటకు నాకు గారణము కనబడుట లేదని ఇదివరకే చెప్పినాను. ఈ బ్రిటిషు ప్రభుత్వము పోదు. ఈ ప్రభుత్వ మున్నంతకాలము మనకు భయములేదు.

జేమ్సు: ఆలాగున మనం అనుకొనుటకు వీలులేదులే, రాజబహదూరూ! ఏనాటికైనా మనము భారతీయుల మనుకోవాలి.

ఫ్రాన్సిసు: భారతీయులు మనల జేరనీయరని అంటున్నారుగాదా!

జేమ్సు: అవును. అందుకనే మనం ఇంగ్లీషువారి ప్రియశిశువులముగాన భారతీయులకన్న గొప్పవాళ్ళము; మనల కూరుచుండబెట్టి వారందరు మనల బోషించవలయునన్న పిచ్చియాలోచన లిక మనం మానివేయవలయును. భారతీయులు వారి యభివృద్ధికై సలుపు నన్ని ప్రయత్నములలో మనము పొల్గొనవలయును. ఆ యుద్దేశముతోడనే రైలులో నుద్యోగములు చేయు మనవారందరు తక్కిన భారతీయులతో గలసి పనివారి సంఘము లేర్పరచినారు. సమ్మెలు మొదలైన వాటిలో వారితోబాటు మనవారును కష్టపడి పనిచేయుచున్నారు.

కొజా: జేమ్సు చెప్పినది బాగున్నది. మనం ఈ దేశములో బుట్టినాము. ఈ దేశములో ప్రాణాలర్పించి, ఈ మట్టిలో గలిసిపోవుచున్నాము. ఇంగ్లీషు వారుకాని, ఫ్రెంచి జర్మను వారలుగానీ మనల వారి యింటికి భోజనమునకు బిలుచుచున్నారా? మనతో సంబంధ బాంధవ్యముల నెరపుచున్నారా? మన కిత రాధారములు లేవు. రెక్కలే యాధారములు. అయినప్పడు మనము భారతీయులు సలుపు స్వరాజ్యాందోళనములలో వారికి వ్యతిరేకముగ బనిచేయకుండ, మన నాయకులతో మన సాధకబాధకములు చెప్పుకొని వారి ప్రేమ సంపాదించుకొనవలయును. ప్రభుత్వమువారికి మన కృతజ్ఞత, మన రాజభక్తి వెల్లడించి వారిదయకు బాత్రులమును గావలయును.

డయానా: మీరు చెప్పినది బాగున్నదండీ. కాని తీరా కాలం సమీపించే సరికి వీరూ మనల ద్రోసిరాజనెదరేమో?