పుట:Narayana Rao Novel.djvu/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

నారాయణరావు

కీయవలసిన యగత్యము సంభవించినది యని మేనత్తకు కోపము గావున, తానీ భూలోకరంభను పెండ్లిచేసుకొన్నచో మొదట నీసు చెందినను తన్నతి ప్రేమచే జూచు మేనత్త చివరకు నొప్పుకొని తీరును. ఇంక నామె భర్తయా? ఆయన యనుమతి యెవరికి గావలయును? తన బాలికను తనకిచ్చుట కిష్టములేక పోయినదట. ఆయనకు యిష్టములేక, తుదకు పొలముదున్ను దున్నపోతు కిచ్చి వివాహము చేసినాడు. అట్టివాని యంగీకారముతో దనకు నిమిత్తములేదు.

సంగీతము పూర్తియైనది. పన్నెండు గంటలయినది. డయానా గ్రామ ఫోను తీసి ‘హావైను’ నాట్యగీత మొకటి తగిలించి జగన్మోహనుని నాట్యమునకు రమ్మని పిలిచెను. జేమ్సు ఫ్రాన్సిసుకన్య నడిగెను. ఆ పడుచుజంటలు పాశ్చాత్య ‘జాజు’ నాట్యానందములో మునిగిపోయినారు. పదునేను నిముషము లట్లు పరమ సంతోషపూరితులై నాట్యమాడి తక్కినవారితోబాటు వచ్చి కూర్చుండిరి. ‘జాజు’ ‘వాల్డుజు’ మొదలగు నాట్యములం దొక పురుషుడు నొక వనితయు గలసి నాట్యమాడవలెను. పురుషుడు వనిత నడుముచుట్టు గుడిచేయినుంచి కవుగిలించుకొని ఎడమచేతితో నామె కుడిచేయి పట్టుకొనును. పల్లవాధరియు పురుషుని భుజముపై ఎడమచేయి నుంచవలెను. ఆ సంశ్లేషముతో తాళమునకు సరిపోవునటు లడుగులు గలుపుచు చిత్రగతుల నాట్య మాడెదరు.

జగన్మోహనుడు యూరేషియనులుకూడ మెచ్చునటుల నాట్యమాడ గలడు. అతనితో నాట్యమాడుటయన్న యూరేషియను సుందరీమణులకు నెంతయో ప్రీతి.

వారందరు కూర్చుండిన వెనుక యూరేషియనుల దుస్థితిగూర్చి యావద్భారత యూరేషియను సంఘనాయకుడగు కాల్నెల్ గిడ్నీగారు కలకత్తాలో నిచ్చిన యుపన్యాసమునుగూర్చి చర్చవచ్చినది. ‘ప్రపంచములో నెవ్వరి స్థితియైన విచారకరముగ నున్నదన్న నది భరతదేశపు మన యూరేషియనుల స్థితి. మనల భారతీయులు దరికి జేరనీయరు. పాశ్చాత్యులదృష్టిలో మనము సంకరులము. శుద్ధయైరోపీయ రక్తము మనవారి నాడుల బ్రవహించుటలేదట. ఇటుల నీ రెండుజాతులచే నిరసింపబడిన మనము తీవ్రముగా మన కర్తవ్యము, మన భావిభాగ్యోదయమును గురించి యాలోచింపవలయును. హిందూ దేశములో మన జనసంఖ్య చాలాతక్కువ. మనమును కొలదికొలదిగ దేశమెల్లడ నున్నాము. కావున మనవోట్లెవరికి నుపయోగములేదు. మనకు స్థానిక సంస్థలలోగాని శాసనసభలలోగాని సరియైన ప్రాతినిధ్యము లేదు. మనవా రెందరో రైలు కంపెనీలలో బండినడుపువారుగా, గార్డులుగా, టిక్కెట్టు పరీక్షచేయు వారుగా, స్టేషనుమాస్టర్లుగా, ఇంజను పారిశ్రామిక స్థానములలో పనివారలుగా నియమింపబడియున్నారు. రైలుమార్గము లింగ్లీషు కంపెనీల చేతులలో నున్నంతకాలము మనవారి యుద్యోగముల కంత భయములేదు. అవియన్నియు