పుట:Narayana Rao Novel.djvu/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యూరేషియను సాంగత్యము

131

శ్రుతి ముఖ్యము, శ్రుతి సర్వము. దానికై వారు రెండుమూడు రాగములనే తీసికొన్నారు. భారతీయ సంప్రదాయము రాగము లెన్నియేని సృజించు కొన్నది. తాళభేదముల వృద్ధి చేసినది.

౮(8)

యూరేషియను సాంగత్యము

జగన్మోహనుడు భారతీయ గానసాంప్రదాయము విని యానందించలేడు. పాశ్చాత్య గాంధర్వమేనియు నాతని హృదయము గరిగింపలేదు. బడాయి కొరకు, గౌరవము కొరకు మర్యాదకొరకు నాతడు వినినట్లు నటించును. కాని మనస్సులో దన యాలోచనలలో నాతడు మునిగిపోవును. ఆడువారు, అందులో పడుచువారు కచ్చేరీ చేయునపుడుతక్క, నాతడు గానసభలకేగడు. పాడునట్టి యామె కన్నుల దిలకించును. కంఠము, పెదవులు, వక్షము గమనించుచు వివిధభావపథముల విషయలోలుడై యానందించును. లోకముమాత్రము జగన్మోహనరావుగారికి సంగీతమన్న పరమప్రీతియని ముచ్చటించుకొను చుండును.

డయానా పాడుచున్నంతసేపు నామె గంభీర నిషాదకంఠము నాలకించుట మాని యామె కంఠసౌందర్యము, గిరజాలవలె కత్తిరించియున్న యామె జుట్టు మెలికలు గమనించుచు, నా ప్రోడ తనకు ప్రియురాలగుటకు తానెంతటి యదృష్టశాలియో యని తన్ను దా మెచ్చుకొనుచుండెను. ఈమెను పెండ్లి యాడుటయే ధన్యత యనుకొనెను. తనకన్న రెండేడులు పెద్దయైన నేమి, అట్లెన్ని వివాహములు పాశ్చాత్య దేశములలో జరుగుట లేదు? నిజమైన నాగరికత వారికడనే యున్నది. వారివలె జీవించుటకన్న మానవుని బ్రతుకున కింక నేమి సౌందర్యము కావలెను? ఈమె యూరేషియను బాలికయని కొందరు తన్ను నిరసించవచ్చును. ఇంగ్లీషు బాలికలకన్న నీమె మిన్న యైనపుడు ఈ స్త్రీరత్నము నేల గ్రహింపరాదు? చెన్నపట్టణములో జదువుకున్న ఈ బాలిక విద్యావంతురాలు. తన తల్లి యొప్పుకొనక కొంచెము గడబిడ చేయు మాట నిజమే. ఆమె యెంతసేపు జమీందారీయెత్తుగల సంబంధము కావలయునని కోరును. ఇంగ్లండు దేశములో గూలివా డీ దేశములోని జమీందారులతో సమానము. వారితో సమానమగువారే యూరేషియనులు. అట్టిచో తల్లి యెట్లభ్యంతర పెట్టగలదు? ఇక జాతి మతముల మాటయా? బ్రాహ్మణులకన్న యూరేషియను అన్ని విధముల గొప్పవారే కద! డయానా యెంత సంతసించును? ఆ సుకుమార శరీర, యా దివ్య సుందర విగ్రహ తనకు బ్రియతమయగు భార్యయై, తన జమీకి రాణియై, తన భవనములో జక్రవర్తినియై సంచరించుచుండ చూచిన వారు పరమపవిత్రులైపోదురు. తన మేనత్త కూతురు ముద్దుల మిటారి, శారదను తాను పెండ్లియాడక పోవుటచే ఆ పల్లెటూరి పందకు, ఒరాంగు ఉటాంగుకోతి