పుట:Narayana Rao Novel.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రై లు కూ డా త థా స్త న్న ది

11


నారాయణరావు సంభాషణప్రియుడయ్యు మితభాషి. తన హృదయానికి పులకరాలు కలిగించు చర్చ వచ్చినచో, పట్టుదలతో యుక్తులతో గంభీరమైన విద్యాప్రౌఢితో కవిత్వమువలె, గీతమువలె ఉపన్యసింపగలడు. సంభాషణలో నెదుటి వానిని చెరిగివేయగలడు. అప్పు డాతని సహజవినయసంపద మాయమగుట కూడ నొకచో సంభవించును. కొరడాకొసలవలె చురుక్కుమనిపించును. అపహాస్యరసము నంజుడు చూపును. ఎన్ని విషయములైనను అలంకారములతో, ఉదాహరణలతో, భావనాపథములకు నెత్తి వేయుచు మాట్లాడగలడు. కాని తనకు గౌరవాస్పదులగు పెద్దలన్న యెట్టి వాదములకు బోడు.

లక్ష్మీ: మా బావగారి తరఫున నన్ను కొంచెం వాదించనీయండి. అతని అభిప్రాయాల్నే నేను మనవి చేస్తాను. అత ననేది ... ఇప్పుడు దేశంలో విజృంభించియున్న ‘లా’ ధర్మదూరమంటాడు. సత్యానికి చాలా దూరమంటాడు. అసత్యం కలపందే నిజం కూడా నెగ్గదంటాడు. సాధారణంగా నిజం అసలు నెగ్గదంటాడు. ఇప్పుడుండే సాక్ష్య చట్టము, వ్యావహారిక చట్టాలూ చాలా దోషభూయిష్టాలనీ, అసలు ఆ తప్పు ప్రస్తుత కాలంలో ‘లా’ యొక్క తత్వం లోనే ఉందనీ, అలా ఉన్నంత కాలం ‘లా’ సత్యానికి వేలకొలది మైళ్ళ దూరంలో ఉంటుందనీ వాదిస్తాడు.

జమీందారుగారు తన హృదయము గ్రహించి నారాయణరావు సిగ్గుపడుచున్నాడని భావించుకొని, ఆతని మాట్లాడించక, ఇతరులతో ననేక విషయములు సంభాషించినారు.

మెయిలు వాయువేగముతో ఏలూరు వచ్చినది. జమీందారుగారు దిగి పోవుచు అందరితో తాను సెలవుతీసుకొనుచున్నాననియు, ఆనాటి స్నేహము మరల మరల తన కా యువకమండలి ప్రసాదించవలెననియు గోరినాడు.

‘నేను మిమ్మల్ని ప్రార్థించేది మీరంతా ఈరోజున మా ఊరిలో మా యింటికడ నా ఆతిథ్యం స్వీకరించాలని.’

ఆలం: అయ్యా, నేను సంతోషముతో వచ్చేదే. మాది ఏలూరు. నేను వస్తున్నానని మా తమ్ముళ్ళు, చిన్న చెల్లెలు స్టేషనుకు వచ్చారదుగో. మా అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి.

జమీం: మిమ్మల్నెవర్నీ నేను బలవంతపెట్టను. ఎవరికి వీలుంటే వారు వస్తే చాలా సంతోషిస్తాను. నాకు ఏ సంగతీ గోదావరిస్టేషనులో చెప్పాలని కోరిక.

అని జమీందారుగారు లేచి, వారందఱు తనకొనర్చిన నమస్కారములకు ప్రతినమస్కారము లిడి, వెడలిపోవుచు, ‘లక్ష్మీపతి గారూ, ఒకసారి నాతో వస్తారా, ఒక చిన్న పని ఉంది’ అని పిలిచినారు.

లక్ష్మీపతి ‘చిత్త’ మని ఆయనవెంట వెళ్ళినాడు. దారిలో కనబడిన గార్డును చూచి జమీందారుగారు ‘గార్డ్! వీరు నాతో మొదటితరగతిలో