పుట:Narayana Rao Novel.djvu/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హార్వర్డు

117

కతిపయదినములకు నౌక శాన్‌ఫ్రాన్సిస్‌కో నగరము వచ్చి చేరినది. ఆ మహాపట్టణము అమెరికా పడమటితీరముననున్న గొప్ప నౌకాశ్రయస్థలము. ప్రసిద్ధికెక్కిన రేవుపట్టణము. పశ్చిమతీరమున నిది మహాపట్టణ మగుటవలన ఇక్కడనే చీనావారివి, జపాను వారివి అనేకవేల కుటుంబములున్నవి. శాంత మహాసముద్రమున దిరుగు నౌకలు శాన్‌ఫ్రాన్సిస్‌కో వచ్చి యచ్చటనుండి పెనామాకాలువ దాటి అట్లాంటిక్ మహాసముద్రోపశాఖయగు మెక్సికో సముద్రమునుండి న్యూయార్కు, బోస్టన్, ఫిలెడెల్ ఫీయా మొదలగు పట్టణములకు బోవును.

రామచంద్రరావు, అర్జున సింగు, రౌనాల్డుసస్, ఆయన కుమార్తె యందరు ఓడదిగి ‘ది గేట్ వెస్ట్రన్’ అను భోజనహర్మ్యమునకు బోయిరి. హిందూ దేశ వాసస్థుల ఆచారవ్యవహారాదులకంటె జపాను దేశస్తుల ఆచారవ్యవహారాదులు వేఱు. ఈ రెంటికీ, నమెరికా సంప్రదాయములకు నెంతయో భేదమున్నది. అడుగడుగునకు నాయాభేదములు గాంచుచు రామచంద్రరావు విస్మయము పడుచుండెను. రెండురోజుల కర్జునసింగు రామచంద్రుని హాలీవుడ్ అను సినిమా పట్టణమునకు దీసికొనిపోయెను. నెలకు లక్షలకొలది డాలర్లు జీతములు గలవారు, సంవత్సరమున కొకసారి వివాహవిచ్ఛేదమును జేసికొని మరల నితరుల వివాహమాడువారు, మిక్కిలి బలసంపన్నులు, సాహసవంతులు, అందమైన వారు, నాట్యకళావేత్తలు, హాస్యరసచూడామణులగు ప్రసిద్ధ నటీనటుల సమూహము లచట నున్నవి. ఆ పట్టణవీధులలో, నుద్యానవనములలో, కర్మాగారములలో పట్టణములు, ఎడార్లు, మహాసముద్రములు, కొండలు, నదులు, గాలి వానలు, ఎండలు, చీకటులు, మంచుప్రదేశములు, వేలకొలది సంవత్సరముల నాటివి, వందలకొలది సంవత్సరముల నాటివి, నేటివి ప్రతిదినము పుట్టుచు మాయమైపోవుచుండును. సృష్టిమాయాతత్వమెల్ల నచ్చట ననుక్షణము కన్నుల గట్టుచుండును.

అచ్చటనుండి మోటారులో, రైలులో ననేకవేలమైళ్లు పయన మొనర్చి న్యూయార్కు పట్టణమునకు మన యాత్రికులందరు విచ్చేసినారు. రామచంద్రరావు మూడుదినములు రౌనాల్డుసన్ వైద్యశేఖరుని కతిథియై మర్యాదలు చూరగొనినాడు. రౌనాల్డుసన్ గారి వైద్యాలయమునకు వారి జనపదావాసమునకు లియోనారాకన్యయు, నిటలీనుండి తండ్రి కుమార్తెలకన్న ముందుగా వచ్చిన రౌనాల్డుసన్ సతియు, రామచంద్రుని గొనిపోయిరి. వారి భవనములన్నియు స్వర్గలోకతుల్యములైయుండెను. రౌనాల్డుసన్ భారతీయ విగ్రహములను, జిత్ర లేఖనములను, లక్కబొమ్మలను, దెరలను అలంకరించిన యొక శాలకు ‘భారతీయ మందిర’ మను నామకరణముంచెను. వేరొక మందిరము ‘చీనా మందిర’ మట. వేరొకటి ‘గ్రీకుమందిర’ మట. ఇంకనొకటి ‘ఈజిప్టుమందిర’ మట. వీని యన్నిటియం దలంకరించిన విగ్రహములకు, చిత్రములకు, బంగారు, వెండి, రాగి సామానులకు, గంథము, దంతము, పింగాణీ చెక్కడములకు,