పుట:Narayana Rao Novel.djvu/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

నారాయణరావు

చరిత్రలు, కథలు, కవిత్వము ఆ బాలిక బ్రతుకు మూలమంట గదలించి వేయును.

తండ్రి కుమార్తె లిరువురు భారతీయులతో స్నేహ మొనరింప ముచ్చట పడుచుందురు. ప్రసిద్ధ భారతీయు లమెరికా వచ్చినపుడు వారిని తమయింటి కతిథిగా బిల్చుచుందురు. రవీంద్రనాధుడు, మెహర్ బాబా, ప్రేమానందస్వామి, కృష్ణాజీ మొదలగువా రాయన భవనమున కతిథులుగా వచ్చినారు. తారకనాధ దాసు, సుధీంద్రబోసు, లజపతిరాయి వారియింటికి తరచు వచ్చుచుండువారు.

రామచంద్రు డొక యుత్తమ బ్రాహ్మణకుమారుడు, భారతీయుడని వినినంతనె తండ్రి కుమార్తె లిరువురు నాతని స్నేహ మొనరించి తమగృహమునకు దీసికొనిపోయి ప్రసిద్ధినొందిన హార్వర్డు విశ్వవిద్యాలయములో బ్రవేశ పెట్టింప దలపోసినారు.

౪(4)

హార్వర్డు

శాంతమహాసముద్రము మహాసముద్రములలోనెల్ల విచిత్రమైనది. ఇందున్న దీవులు పెక్కులు. దీవులలోని పంట అద్భుతము. ఇచ్చటనే బొప్పాయి, టొమాటో, పొటాటో, పొగాకు, సదాపనస, పంపర, అనాస, జీడిమామిడి మొదలగు జాతులు ప్రథమమున నుద్భవించినవి. నిర్మల శర్వరీగగనముల మినుకాడు నక్షత్రకాంతులు సముద్రపు నీటిమెరపులలో బ్రతిబింబము లైనవి. ఉబుకు తరంగముల గీతికలలో జ్యోత్స్నారేఖలు పొదిగింపబడినవి. ఆ మహానౌక యపరిమిత వేగమున నడుచుచున్నది.

రామచంద్రునకు రౌనాల్డుసన్ తన స్నేహితులందరితో పరిచయము కలిగించినాడు. రామచంద్రుని విజ్ఞానమునకు వారందరపరిమితానందము నొందుచుండిరి. ఎంతటి చిక్కులనైన నాతడిట్టె విప్పి చెప్పగలడు. పదార్థ విజ్ఞానశాస్త్ర రహస్యములన్నియు వానికి గరతలామలకములు. కావున నాతడు విద్యుచ్ఛక్తి విషయికమగు జ్ఞానమునెల్ల సముపార్జించుట యుత్తమ మనియు, దనదేశమునకు, దనకు ఖ్యాతితెచ్చుట కింతకన్న వీలింకొకటి లేదనియు లియోనారా యాతనికి జెప్పి యొప్పించెను.

ఓడలోనుండియే రౌనాల్డుసన్ హార్వర్డు విశ్వవిద్యాలయమునకు వాయు వార్త బంపి రామచంద్రుని ప్రవేశమున కంగీకారము సంపాదించెను.

అర్జునసింగు శాంతనుహానీరధీ తీరములనున్న పట్టణములలో వర్తకముజేయు నొక చీనా కోటీశ్వరుని యుద్యోగి. అతడును స్వంతముగా గొంత వర్తకము జేయుచుండును. అర్జునసింగు నివాసము శాన్‌ఫ్రాన్సిస్‌కో నగరము.