పుట:Narayana Rao Novel.djvu/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
114
నా రా య ణ రా వు

తండ్రి, మహావిద్వాంసుడు, విద్యుచ్ఛక్తిచే వూడిగంచేయిస్తున్న మంత్రవేత్త థామస్ ఎడిసన్ గారి విద్యుచ్ఛక్తి కర్మాగారాలలో కృషి చేయవలెననియూహ.

రామ: అలాగాండి. హార్వర్డు బాగుంటే అక్కడే చేరుతాను.

డా. రౌనా: మీ దేశంలో వైద్యసహాయం చాల తక్కువట కాదా?

అర్జున: అవునండి. మీ మిషనరీలు మా దేశ దౌర్భాగ్యములన్నీ గ్రంథములలో వ్రాసినారు. పాపం మిషనరీలే లేకపోతే మాదేశం ఈపాటికి నీగ్రో దేశంవలె అయిపోయియుండును.

రామచంద్రుని వినయసంపదయు జ్ఞానసముపార్జనా తీవ్రోత్కంఠతయు డాక్టరు రౌనాల్డుసన్ గారి హృదయమును జూరగొన్నది. రామచంద్రుడు చక్కని ఇంగ్లీషుభాషలో తన దేశస్థులు, తన మతము, తన దేశములోని రాజకీయాందోళన, గాంధిగారి వర్తమాన కార్యక్రమము మొదలైనవానిని గూర్చి ఆయనకు దెలిపినాడు. గాంధీమహాత్ముని యుపదేశములు ప్రజా సామాన్యమునకు బాగుగా నచ్చినవనియు, నుద్యోగ వాంఛాపరులగు విద్యాధికులకు మాత్రము పదవులపై నాశ వదలలేదనియు తెలిపినాడు.

డాక్టరు రోనాల్డుసన్ అమెరికాకు ప్రథమమున వలసపోయిన పిలిగ్రిం ఫాదర్సు (యాత్రిక వృద్ధులు) సంతతివాడు. ‘నీలిరక్తము’ (అచ్చరక్తము) ప్రవహించు ఉత్తమకుటుంబములోనివాడు. కష్టపడి చదువుకొని అమెరికాలోని గొప్పవైద్యులలో నొకడై భాగ్యవంతుడై గౌరవము సంపాదించుకొన్నాడు. సదయహృదయుడు, నీగ్రోల బానిసత్వము సంపూర్ణనాశనము చేయవలెనని వాదించు నానుష్ఠానిక క్రైస్తవుడు. క్రైస్తవమతము చర్చిమత మైనదనియు, యేసుక్రీస్తు బోధించిన మతము మహోత్కృష్టమైనదనియు అందలి పరమార్థమును గ్రహించినవారు కొలదిమందియే యనియు రౌనాల్డుసన్ వాదించును. హోల్మ్సు మతగురువు బోధ రౌనాల్డుసన్ మహాశయునకు బూర్తిగా నచ్చినది. అన్ని శక్తులలో బ్రేమశక్తి దొడ్డది. ప్రేమయే భగవత్స్వరూపము. సూర్యుడు మంచును కరగించునట్లు, పేమ పాషాణ హృదయమునైన ద్రవింపజేయును. ప్రేమ జగమును వెలిగించు దివ్యజ్యోతి. ప్రేమ లేనినాడే క్రోధము, హింస, స్వలాభము, మాయ, అహంభావము, అసత్యము విజృంభించును. లోకమునందలి యుద్ధములు, దొంగతనములు, వర్తక కౌటిల్యము మొదలగు దుర్గుణములకు గారణము ప్రేమలేమియే యని యాయన స్నేహితులతో వాదించుచుండును.

పరదేశ స్వతంత్రత, యుద్ధరాహిత్యము, వర్ణభేదవిచ్ఛేదనము మున్నగు నాశయములతో పనిచేయుట కమెరికా దేశములో నెవ్వరు ప్రయత్నించుచున్నను వారికి రౌనాల్డుసన్ తన చేతనైన సహాయము జేయుచుండును. సన్‌డర్ లాండు, హోల్మ్సు, శాసనసభికుడు బోరా మొదలగువారాయన స్నేహితులు.