పుట:Narayana Rao Novel.djvu/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

నారాయణరావు

నిట్టూర్పు నించెను. నారాయణరావునకు గొన్ని కుంచెలు రంగులు కొని రామచంద్రరావు పంపించెను.

రామచంద్రరావు అమెరికాకు వెడలుదినము సమీపించినది. రాజకీయ కారణమువలన జన్మభూమిని విసర్జించి జపాను దేశమును బెంపుడుతల్లి నొనరించుకొని, కలలలో, జాగ్రదావస్థలో గంగానదిని, కాళీఘట్టమును, హిమాలయ పర్వత శ్రేణిని స్వప్నములగాంచు రసవిహారుడు రామచంద్రరావును గవుంగి లించుకొని ‘బాబూ! అప్పుడప్పుడీ దేశము వచ్చు భారతీయులే నాకు భారత దేశము సుమా! వారి మూర్ధములందు హస్తతలములందు నా వంగదేశపు పంట భూములను, శేఫాలికా జపాకుసుమములను నాఘ్రాణించుచు వారి కన్నుల కాంతిలో నా గంగానదీ పావనోదకముల దర్శించుచు, వారి నుదుటిలో నా దేశపు నీల గగనాల ప్రత్యక్షించుకొందును.

‘పంజాబ్ సింధు గుజరాత మరాటా ద్రావిడ ఉత్కల వంగా

వింధ్యహిమాచల యమునాగంగా ఉచ్చలజలధితరంగా’

‘నువ్వు బాలుడవు. నా దేశమాత ముద్దుబిడ్డను. నా సోదరుడవు. అహో రామచంద్ర! నువ్వు నాలుగేళ్లకయిన మనతల్లికొడిలో నాడుకొందువు. మన తల్లి మట్టిలో దొర్లుదువు. మనమాత యిచ్చిన ఆటవస్తువులతో గేరింతలాడుదువు. ఆ పవిత్ర వాయువులు పీల్చెదవు. ఆ యమ్మ చనుబాలు గోదావరి పావనోదకాలు త్రాగుదువు. పో! పో! ఒక్కసారి నన్ను కౌగిలించుకో. మరల నింటిదారి నిటు వచ్చిన సంతోషించెదను. అమెరికా జేరిన వెంటనే నాకు జాబు వ్రాయి’ అని యాతని నా తరణిలో దిగవిడిచి గట్టునకు విసవిస వెడలిపోయినాడు.

టంగ్ టంగ్ మని గంట మ్రోగి తుదికూత నుచ్చైస్వనమునగూసి యా యోడ పెద్ద చప్పుడుతో యోకొహామారేవు వదలినది. రామచంద్రుడు రసవిహారిబాబు మొదలగు భారతీయుల సలహాచే మొదటితరగతి టికెట్టు పుచ్చుకొన్నాడు.

అమెరికా దేశము బీదలను రానీయదు. డబ్బుగల వారిని గౌరవించును. విద్య నేర్చుకొనుటకు వచ్చినను సరియే, నిర్భాగ్యుడు అమెరికా దేశమున ఉపజీవి క్రిమి (ప్యారాశైట్) వలె సంచరించుటకు వీలులేదు. భరతభూమి కన్న పెద్దదియైనను నచ్చట పదికోటులజనులుమాత్ర మున్నారు. వారికి అమెరికా చాలదట. అమెరికనులు రంగుజనులను తమ కుక్కలు, పిల్లులు, గుఱ్ఱములకన్న హీనముగ జూతురు. నల్ల నీగ్రోలు, చైనా జపాను దేశముల పసుపుపచ్చని మంగోలియనులు, ఆదిమనివాసులగు ఎఱ్ఱఇండియనులు, వివిధ వర్ణములు కలవారైన హిందూ దేశస్థులు వారిదేశములో నివసించి అమెరికనులు కాగూడదట. తాత్కాలికముగ కొలది సంవత్సరములుమాత్రము నివసించి పోవలయునట. నీగ్రోజాతివా డేదైన తప్పు చేసినచో, న్యాయస్థానములకు గొనిపోయి విచారించకుండగనే ప్రజలు వాని నురిదీయుదురు. లేదా