పుట:Narayana Rao Novel.djvu/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

నా రా య ణ రా వు


‘రామచందర్! మీకు ముక్కుపచ్చలారింది లేదు. మీరు చిన్నవాళ్లు! దేశం కొత్తది. చాలా మాయకోరులుంటార్. మీరు ఎనక్కిపోయి కాశీలో లక్నోలో కలకత్తాలో చద్వవచ్చును కాదుఅండి? అక్డకూడా చాలా ఎక్వ చద్వు చెప్తార్ కాదా?’

‘మీకూ, మా తండ్రిగారికీ ఉండే స్నేహాన్నిబట్టి అల్లా చెప్తారు కాని, నా మనస్సు నిశ్చయం అయిపోయింది. ఇంక ఎంతమాత్రము నా సంకల్పము మార్చుకోలేను, మార్చను. మీరు పెద్దలు, నాతండ్రితో సమానులు. మీరు చెప్పడం, నేను వద్దనడం బాగుండదు.’

‘సరే! సరే! మీయిష్టం, పర్వాలేదు. నేను అంతా జాగ్రత్త కనుక్కుంటాను. మాచుట్టం ఒకాయన లాల్ చంద్ జీవన్ లాలు న్యూయార్కు పట్నములో మకాం. ఆయనకు ఉత్తరం రాస్తా. మీకూ ఒక ఉత్తరం ఇస్తాం.’

‘చిత్తం. మీ మేలు ఎప్పటికీ మరిచిపోను.’

‘మీ నాయన గారు నాకు, మీకు యివ్వమని, డబ్బుపంపినారు. అది మీకు ఇస్తాను. జాగ్రత్తగా ఉండండి. చాలా చిన్న వాళ్ళు.’

‘చిత్తం. చిత్తం.’

మరునాడు పుల్లంరెడ్డిగారు అమృతలాలు గారి హర్మ్యమునకు విచ్చేసి రామచంద్రుని గూర్చి వాకబు చేసెను. పుల్లంరెడ్డిగారు, ఆమృతలాలుగారు చాలాకాలమునుండి స్నేహితులు, ఒకరన్న నొకరికి గౌరవము.

పుల్లంరెడ్డిగారు అమలాపురం తాలూకా పేరూరు గ్రామవాసులు. చిన్నతనములో కూలికై రంగూనుపట్నమువచ్చి సహజమేధాసంపన్ను డగుటచే త్వరలో మేస్త్రీ అయి, ధనము నిలువచేసికొనెను. తాను గూలికి కుదిరిన గుజరాతీ షాహుకా రొక వ్యాపారమునకై తన్ను సింగపూరు పంపినప్పుడు, పుల్లంరెడ్డి తనకడ నున్న ధనమునంతయు నొడ్డి స్వయముగా వ్యాపారము చేసి సింగపూరునుండి వచ్చులోపల నిరువదియైదు వేలు లాభము నొందెను. తన షాహుకారుపనిగూడ చాల శ్రద్ధమై, లాభకరముగ నెరవేర్చి రంగూను వచ్చి వేసెను. చదువురాని పుల్లన్న అంతటనుండి పుల్లంరెడ్డియై, షాహుకారు తనకొక యణా భాగమీయ, నాయన వర్తకములో భాగస్వామియయ్యెను. నాటి నుండియు పుల్లంరెడ్డి పట్టినది బంగారమై, యాతని ధనము నాలుగు లక్షల వరకు బెరిగినది. నలుబదవయేట తన షాహుకారనుమతీయ దాను వేరుగా వ్యాపారముచేసి పదియేళ్లలో నిరువదిలక్షల సంసారియు, ‘రావుబహదూరు’ నై పాశ్చాత్యులచే ‘పులియన్ రెడ్డి’ యని వాకొనబడుచు, దానకర్ణుడై రంగూను నాగేశ్వరరాయుడని ప్రఖ్యాతి వహించినాడు.

రంగూన్ లో నాంధ్రులందరును గూలిచేయువారలే. కొంతమందిమాత్ర ముద్యోగములు చేయుచుండిరి. వర్తకము చేయువారు మరియు తక్కువ.