పుట:Narasabhupaleeyamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

కావ్యాలంకారసంగ్రహము

గుణాదివిరోధద్రవ్యవిరోధములు —

మ.

తలిరుంబోఁడి సరాగ యయ్యు ధవళత్వం బొందు నుచ్చైఃస్తనా
చలభారాసహ యయ్యు దా నచల యౌఁ జర్చింపఁగా నార్య యై
చెలుఁవం బందియు నన్యభాష యగు నీచేతోజశస్త్రాహత
న్నలినాక్షీమణి నేలు మింక నరసేంద్రా సాంద్రతేజోనిధీ.

126

విశేషము —

క.

ధారణి నా ధేయము నా, ధారముగా నొకట నేకతరకలితముగా
సారెకు నశక్యకరణం, బారూఢముగా విశేష మగు నె ట్లన్నన్.

127

ఆధారరహితాధేయము —

చ.

దురమున శ్రీనృసింహుఁ డతిదుర్మదవీరవిరోధిపంక్తిపై
సరభసవృత్తి నత్తలము సాఁపఁ బ్రదీప్తము లయ్యె దన్మహా
మరకతపుష్యరాగనవమౌక్తికవిద్రుమనీలకాంతిచే
సురపదవీథిపై జనులచూడ్కి కభిత్తకచిత్రకర్మముల్.

128

ఏకానేకగోచరము —

క.

కలఁడు గలఁ డన్నచోటం, గలుగు నృసింహుఁ డవుగానఁ గానల గిరులం
గలలోన మ్రోలఁ బిమ్మట, నలఘుస్థితి నీవ యగుదు వరికి నృసింహా.

129


సీ.

దారుణాఖండమార్తాండమండలము ను, ప్పొంగి గుటుక్కున మ్రింగవచ్చు
గంభీరఘుమఘుమారంభసంరంభదు, గ్ధపయోధి చెంగున దాఁటవచ్చుఁ
జండికాజానేయగండప్రకాండము, ల్వీఁకఁ జరాలున వ్రేయవచ్చుఁ
గుటిలోగ్రశతకోటికోటిసంఘాటము, ల్కినిసి ఘణిల్లునఁ దునుమవచ్చుఁ


తే.

గాని పశ్యదళీకభీకరదృగగ్ర, జాగ్రదనలోజ్జ్వలజ్వాలజాలజటిల
గురుభుజ శౌర్యు నినుఁ జెన్కఁదరమె యరుల, కౌబలేంద్రునినారసింహక్షితీంద్ర.

130

అధికము —

క.

ఆధారం బల్పం బై , యాధేయం బధిక మైన నది యల్పం బై
యాధారంబును నధికం, బై ధర రంజిల్ల నధిక మగు ని ట్లన్నన్.

131

అధికాధేయము —

క.

ఘనరోమకూపవాతా, యనముల కణుపంక్తు లగునజాండంబులచేఁ
దనకు హరికుక్షి నడఁగక, యనఘాబ్జత వెడలె నీదుయశము నృసింహా

132

అధికాధారము —

క.

నీదునిరవద్యకీర్తి మ, హాదుగ్ధవయోధిలోన నాదిమరాజ
ప్రాదుర్భూతయశంబులు, ప్రోదిం బుద్బుదములట్లు పొల్చు నృసింహా.

133