పుట:Narasabhupaleeyamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

కావ్యాలంకారసంగ్రహము


క.

కలకంఠరుతులఁ బిలుచును, ఫలములు చవి చూడుఁ డనుచుఁ బదములఁ బెనఁగున్
బలమఱి పఱచు భవద్రిపు, లలనాతతిఁ గాంచి వింధ్యలతలు నృసింహా.

109

వక్రోక్తి —

క.

వేరొకవివిక్షఁ బలికిన, చారూక్తికి శ్లేష, కాకుసంబంధముచే
వేరొకయోజన దెచ్చిన, నారయ వక్రోక్తి యయ్యె నది యె ట్లన్నన్.

110


ఉ.

ఇంతి భవన్మనోగతుఁ డెవ్వఁ డినుం డినుఁ డైన బద్మనీ
కాంతుడొ రాజశేఖరుఁడు గా నితఁ డాతఁడు గాఁడు రుద్రుడో
శాంతి లలాటలోచనుఁడు గాఁడు నృసింహుఁడు మాధవుండొ ని
న్నింతట మెచ్చితిం జెలి నిజేశుఁడు మాధవుఁ డౌ శుభాకృతిన్.

111

స్వభావోక్తి —

క.

సహృదయహృదయంగమ మై, మహి నున్నది యున్న యట్ల మాటలతేటల్
బహుళంబులు గాఁ జెప్పిన, మహితోక్తియె జాతి యయ్యె మది నె ట్లన్నన్.

112


సీ.

తలచూపి మోసులై త్రాసులై తళు కెక్కి, నిక్కి నక్కులవలె నెరసి బెరసి
గెఱకట్టి కళుకు లై కెరలి పోఁకంత లై, వింతలై చెంతల విరివిఁ జెంది
జిగిదొట్టి మిట్టలై బిగువు లై బుగడ లై, మొగడ లై నిగనిగన్నిగల నెగడి
కొన లుబ్బిగబ్బులై గుబ్బ లై యపరంజి, కుండ లై కొండ లై దండ నించి


తే.

దొరసి యొండొంటి నొరసి క్రిక్కిఱిసి మెఱసి, యగణితస్ఫూర్తి మొగమున కెగయు నీదు
వలుదవలిగుబ్బచన్ను లోవలపులాడి, నేడు నరసింహుకౌఁగిట నెరపఁ గలిగె.

113

వ్యాజోక్తి —

క.

తేజరిలు వేడ్కతో న, వ్యాజసముద్భూత మైనవస్తువు నెలమిన్
వ్యాజంబు చేసి డాఁచిన, వ్యాజోక్తి యనంగఁ బొల్చు నది యె ట్లన్నన్.

114


క.

బాలామణి నరసింహనృ, పాలాగ్రణిఁ జూచి ప్రమదబాష్పావృత యై
లీలాసౌధసముత్థిత, కాలాగురుధూప మెంతఘన మని పల్కున్.

115

మీలనము —

క.

అతనిం బ్రబలం బగువ, స్తువుచే వస్త్వంతరంబు సొరిది నడఁగినం
గవులమతంబున మీలన, మవునది యన్వర్థ మగుచు నది యె ట్లన్నన్.

116


శా.

నీధాటీవిచలద్బలోద్భలభటానీకోదయద్భీతిచే
భాధాహేతువనోగ్రజంతుభయముం బాటింప కాత్మ న్రిపు
క్ష్మాధీశాంగన లద్రికందరల వె ల్గంచు న్భుజంగస్ఫటా
సాధూద్యన్మణిపంక్తి గప్పుదురు దోశ్శక్తి న్నృసింహాధిపా.

117