పుట:Narasabhupaleeyamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

కావ్యాలంకారసంగ్రహము

బింబప్రతిబింబోపమ —

క.

గురుశౌర్యయుతము నాయక, కరవాలము నగునృసింహుఘనభుజ మలరున్
దరళఫణామణికిరణ, స్ఫురణము జిహ్వాల మైనభోగియుఁ బోలెన్.

28

అనన్వయము —

క.

సరసం బగు నొక్కటికే, ధర నుపమానోపమేయధర్మము దిర మై
పరఁగిన ననన్వయం బగు, నరయంగా దీనిలక్ష్య మాపాదింతున్.

29


క.

నీదయకు నీడుజో డగు, నీదయ నీజయముసాటి నీజయ మిలలో
నీదానమునకు నెన యగు, నీదానము నీకు సాటి నీవె నృసింహా.

30

ఉపమేయోపమ —

క.

నిపుణస్థితి నుపమేయం, బుపమానముఁ బోల మఱియు నుపమానం బా
యుపమేయముఁ బోలఁగఁ దగు, నుపమేయోపమ యనంగ నొగి నె ట్లన్నన్.

31


క.

శరణాగతభరణంబున, నరసింహునిసాటి వచ్చు నరసాహసుఁ డీ
నరసింహుఁ డితని కెన యా, నరసింహుఁడె కాక యితరనరులకు వశమే.

32

స్మరణము —

క.

ధర నొకవస్తువుఁ గనుఁగొని, వరుసం దత్సదృశ మైనవస్తువు దలఁపన్
స్మరణం బని పాటింపుదు, రరయ నలంకారవేత్త లది యె ట్లన్నన్.

33


క.

ఇల యంత్రమత్స్య మేయను, విలు పూనినశ్రీనృసింహవిభుఁ గాంచి జనుల్
తలఁపుదురు ద్రుపదకన్యా, కలితకరగ్రహణనమితకార్ముకుఁ బార్థున్.

34

రూపకము —

మ.

అల సందేహముమాడ్కి గాక యుపమేయం బెన్న నచ్చన్న మై
యలఘూత్ప్రేక్షయు నా నభిన్నమతిజం బై యుండ కారోప మిం
పలరంగాఁ బ్రకృతోపమోగిపరిణామారోపతుల్యంబుగా
కలయారోపిత మిందు రంజనము సేయన్ రూపకం బై తగున్.

35


క.

అరయ రసజ్ఞులమతమున, నరు దగునీరూపకంబు సావయవంబు
న్నిరవయవంబును వరుసం, బరంపరిత మనఁగఁ ద్రివిధభావము నొందున్.

36


చ.

అరయ సమస్తవస్తువిషయంబును నేకతలప్రవర్తి యై
యరుదుగఁ బొల్చుసావయవ మవ్వలఁ గేవలమాలికాఖ్య మౌ
నిరవయవంబు క్లిష్టమును నేర్పున శ్లేషవిహీన మౌ పరం
పరితము తత్ప్రభేదములఁ బాయక కేవలమాలికాఖ్య మౌ.

37


క.

కావున రూపక మష్టవి, ధావహ మగులక్షణంబు లలలక్ష్యంబుల్
వావిరి నొనర్తు వీనికి, భావజధనురసమరసవిభాసితఫణితిన్.

38