పుట:Narasabhupaleeyamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరసభూపాలీయము. ఆ. 3.

53

విషాదము —

క.

అలరులు మరువమ్ములు హిమ, జల మిందుకరోదికంబు శత్రువు దలఁపం
జల గాడ్పు శ్రీనృసింహుం, డలిగినవాఁ డెట్లు మాను నతివకుఁ గాఁకల్.

74


క.

మదము మదిరాదికృతస, మ్మదమోహవ్యతికరంబు మఱి యౌత్సుక్యం
బదన సమయాక్షమత్వము, నది నర్థవినిర్ణయంబు మతి యె ట్లన్నన్.

75

మదము —

క.

అమరునృసింహునివనమున, నమితాసవరసము లాని యలియౌవతముల్
భ్రమియించు నాడుఁ బాడును, రమణులతోఁ గూడి సాంద్రరాగప్రౌఢిన్.

76

ఔత్సుక్యము —

క.

వరుఁ బిలువఁబనిచి యెపుడెపు, డరుదెంచునొ యనుచుఁ దలఁచి యభిముఖియగుబి
త్తరి యింతపరాకైనను, నరయఁ దదాలోకవిఘ్న మగు ననుభీతిన్.

77

మతి —

క.

చెలువరో శ్రీనరసింహుం, డలనాఁటి నృసింహమూర్తి యగుఁ గాకున్నన్
దలఁచినతావుల నెల్లను, నెలకొని సాన్నిధ్య మొందునిపుణత గలదే.

78


క.

జగతిం జిత్తనిమీలన, మగు నిద్ర యనంగ మూర్ఛ నందుట మోహం
బగు బోధ మెఱుకఁ జెందుట, యగణితమృతియత్న మంత మగు నె ట్లన్నన్.

79

నిద్ర —

క.

కలనైన శ్రీనృసింహునిఁ, గలయం గల నంచుఁ గలికి కన్నులు మొగిచెం
జెలి బాహ్యేంద్రియపథమున, నలరు మనం బరుగకుండ నాగిఁనభంగిన్.

80

మోహము —

క.

అతనుశరహతుల సొరిగెను, సతి విరహతపస్సమాధిజనితవ్రత యై
ధృతి శ్రీనృసింహుఁ దలఁపఁగ, మతి తన్మయమగుచు మేనుమఱచినభంగిన్.

81

బోధము —

క.

తరణీకులాధీశయశ, స్తరుణి జడత్వంబు మాని సంఫుల్లసితాం
బురుహాక్షియు జృంభిత యై, చిరగతి మేల్కనియె శ్రీనృసింహుడు గలుగన్.

82

మృతి —

క.

వల పెఱిఁగి రాఁడు కౌఁగిట, నలమఁడు నరసావనీంద్రుఁ డని వగవఁజుమీ
చెలులను జిలుకయు నెవ్వతి, వల నగునో యనుచుఁ గొంత వగచెద నాత్మన్.

83


క.

ముద మిష్టలాభస, మ్మద మగుఁ గర్తవ్యకార్య మందోద్యోగం
బది యలసత సందేహా, భ్యుదయబహుత్వము వితర్క మొగి నె ట్లన్నన్.

84