పుట:Narasabhupaleeyamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

కావ్యాలంకారసంగ్రహము

స్థాయిభావకారణము —

క.

ఈరసముల కుత్పాదన, కారణము విభావ మనఁగ గల దది ద్వివిధం
బై రంజిలు నాలంబన, మారయ నుద్దీపనంబు ననఁ[1]గ ధరిత్రిన్.

27

విభావస్వరూపము —

క.

వనితయుఁ [2]బతియును నాలం, బన మగు నుద్దీపనంబు ప్రాయంబును సొ
మ్మును జేష్టయు మదనాదులు, ననఁ దగు నేర్పఱుతు వీని కగులక్ష్యంబుల్.

28

ఆలంబనవిభావము —

చ.

అలరురతిన్ రతీశు దమయంతి నలు న్నలు వొంద ముందు గా
నలువ సృజించి యుందుకతనం దనచేయళు కెల్లఁ దీఱి నే
ర్పలవడ నీలతాంగి నరసాధిప నిన్నును గూర్చి ప్రేమసం
కలికముగాఁ దంపతులు గా నొనరింపఁగఁ బోలు నెంతయున్.

29

ఉద్దీపనవిభావము — ప్రాయము

మ.

వరవక్త్రేందువిలాసకృన్ననవయోవర్షావససానంబుసం
దరుణీశైశవసింధు లింకునెడఁ దత్తత్కాలలక్ష్యంబు లౌ
సరసాంతస్థితగండశైలము లనం జందోయి యంతంతకుం
బరఁగుం దత్క్రమశోభరేఖ లనఁ గన్పట్టు వ్వళీపుంజముల్.

30

సొమ్ము —

క.

వెలఁదికి మణితాటంకము, లలరున్ దిగ్విజయకాంక్ష నతనుఁడు చూపుం
జిలుకులు నిశాతములుగా, నలవడ వడిఁ దీడుశాణ యంత్రము లనఁగన్.

31

చేష్ట —

చ.

సుదతి నృసింహుని న్మరల చూచె విలాసవివర్తితాస్య యై
వదలనిప్రేమ వెన్తవిలి వచ్చె ముఖేందుఁ డటంచు భీతిచేఁ
జెదరి గిరీంద్రదుర్గములు సేరినచీఁకటి వోలె వాసనా
స్పద మగువాలుఁగొప్పు వలిచన్నులపై నసియాడుచుండఁగన్.

32

తటస్థములు —

చ.

చిగురుఁగటారితోఁ జెఱకుసింగిణితో నలరంపగుంపుతో
నిగనిగమించుచెంగలువ నేజముతోలో పడిఁ జిల్కతేజిపై
మగఁటిమి నెక్కి శూరుఁ డయి మారుఁడు కోకిలకంఠకాహళుల్
నెగడ లతాంగిపై వెడలె నేఁడు నృసింహ యె ఱుంగఁ జెప్పితిన్.

33
  1. గారతికిన్
  2. బురుషుఁడు