పుట:Narasabhupaleeyamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

కావ్యాలంకారసంగ్రహము


ఉ.

చల్లదనంబె చంద్రునకుఁ జక్కదనంబె ప్రసూనధన్వికిన్
సల్లలితోరుసౌరభ మె చైత్రున కొక్కని కొక్క మేలిమే
తెల్లము గాక నాపతి యుదీర్ణగుణాఢ్యుఁడు నారసింహభూ
వల్లభుఁ డట్లు సర్వగుణవైభవ మెవ్వరికైనఁ గల్గుఁనే.

10

హాసము —

క.

చేకొని [1]యహ్రరము లగు, నాకారవికారచేష్ట లాలోకింపన్,
గైకొను మనోవికాస, స్వీకారము హాస మయ్యె విను మె ట్లన్నన్.

11


చ.

అదె యిదె వచ్చె వచ్చె నరసాధిపుదాడి యటంచుఁ బాళెము
ల్బెదరి బరీదుఁ డేఁగునెడఁ బెంపఱి ఖానులు వెన్కముందుగాఁ
గదిసి హయాళ నెక్కి హయకంధరము ల్పొడగాన కప్పుడే
చదిపిరి వాజిమస్తముల శత్రు లటంతు శ్రమింతు రెంతయున్.

12

శోకము —

క.

హితజనవిర[2]హవ్యథచే, నతిశయ మై జనులమానసాంభోజమునన్
బ్రతిదినముఁ బొడవు దుఃఖం, బతిభూమి వహింప శోక మగు నె ట్లన్నన్.

13


చ.

పతుల నృసింహశౌర్యశిఖిపాలుగఁ జేసినయట్టిపాపపు,
నృతధృతి కంతటం జలము జాఱదు మమ్మును దావపావక
ప్రగతులపాలు చేసె నని పల్మఱు రోదన మందువిద్విష
త్సతులకు బాష్పపూరములె చాలు వనానలమున్ హరింపఁగన్.

14

ఉత్సాహము —

క.

అత్యున్నతలోకోత్తర, కృత్యంలులు నేను వేఁడి కృతకృత్యు లిలన్
నిత్యము దలఁచు ప్రయత్నం, బత్యంతోత్సాహ మయ్యె నది యె ట్లన్నన్.

15


మ.

అసిఁ జెండాడి విపక్షపృక్షముల శౌర్యాగ్నిచ్ఛటం బేల్చి శ
స్త్రసరత్సీరములన్ రణోర్వితలమున్ సంక్షుణ్ణముం జేసి వై
ర్యసృగార్ద్రం బొనరించి ప్రోది గొన కుద్యత్కీర్తి సస్యౌఘము
ల్వెస సిద్ధించునె యంచుఁ బల్కు నరసోర్వీనాథుయోధావళుల్.

16

భయము —

క.

క్రూరా[3]కారము చూచిన, నారయ[4] నే జనునిహృదయమందు ననర్థాం
కూరాశంకన మగు నది, ధారుణిలో భయ మనంగఁ దగు నె ట్లన్నన్.

17


చ.

అనఘ నృసింహ నీయరి వనావళి కేఁగి గుహాగ్రసుప్తుఁ డై
యని మరలం గలం గని భయంపడి పాఱుచు నాజి కాదు కా

  1. యతివికృతము లగు, నాకారాలాపచేష్టితాదులు చూడన్
  2. హాదులచే
  3. రాదికమున
  4. ఁగా