పుట:Narasabhupaleeyamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

కావ్యాలంకారసంగ్రహము


క.

ముక్తపదగ్రస్తం బై, సక్తాదిమపద్య మైనసంబోధన మై
ప్రోక్త మగుఁ జక్రవాళము, ముక్తమహాధీరశబ్దమోహన మగుచున్.

170


క.

ఆచక్రవాళలక్షణ, సూచిత మై బిరుదభరితశుభవాఙ్మయ మై
యాచక్రవాళవిపుల, క్ష్మాచక్రమునందు బిరుద గద్యము వొల్చున్.

171


క.

తరుణీమణిశృంగారము, విరహము మధుమదనగర్వవిభవంబు సరో
వరవనఖేలనములు గల, దరయ న్మంజరి యనంగ నభినుతి కెక్కున్.

172


క.

తారక లిరువదియేడును, నారయు నొక్కొక్కపద్యమందుఁ జెలంగం
గూరిచినపద్యమాలిక, తారావళి యనఁగ నభినుతం బై పొల్చున్.

173


మ.

ఫణిశుంభద్భుజసారసారసముఖీపంచాయుధాకారకా
రణసంతత్యవతారతారగిరిధైర్యస్థేమదుర్వారవా
రణసమ్రాడ్బలభారభారవికవిప్రౌఢోక్తిసంచారచా
రణసంస్తుత్యవిహారహారహరవిభ్రాజద్యశోవైభవా.

174

ఓష్ఠ్యము —

క.

భూమీసుమనోమరద్రుమ, వామాప్రద్యుమ్నభానువంశోద్భవపౌ
లోమీవిభుశుభవైభవ, భీమోపమభీమభీమపృథుదోర్వీభవా.

175


పంచచామరము.

ఘనాఘనాఘనాశదాధికప్రగానరంజనా,
జనావనాదినాగతల్పసత్కవిప్రసాధనా,
ధనాధినాథనందనాబ్జదర్పకాంగవాసనా,
సనాతనాధునాతనాతిశౌర్యధుర్యలంఘనా.

176


గద్యము.

ఇది శ్రీ హనుమత్ప్రసాదలబ్ధకవితాసారసారస్వతాలంకారనిరంకుశప్రతిభా
బంధుర ప్రబంధపఠనరచనాధురంధర ప్రబంధాంక వేంకటరాయభూషణ
సుపుత్త్ర తిమ్మరాజపౌత్త్ర సకలభాషావిశేషనిరుపమావధానశారదామూర్తి
మూర్తిప్రణీతం బైనకావ్యాలంకారసంగ్రహం బనుమహాప్రబంధంబునందు
సర్వరససాధారణనాయకవర్ణనంబును శృంగారనాయికాఖ్యానంబును రీతి
వృత్తిప్రశంసయుఁ బాకశయ్యాప్రపంచనంబును గావ్యభేదప్రకరణంబును
మహాకావ్యప్రకటనంబు క్షుద్రప్రబంధమార్గదర్శనంబు నన్నది ద్వితీయా
శ్వాసము.