పుట:Narasabhupaleeyamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరసభూపాలీయము

31

విప్రలబ్ధ —

చ.

ఎనయఁగ నీనివాసమున కే నరుదెంచెద నంచు నాపయిం
గనుఁగొన నిక్కపుంబ్రియము గల్గినవాఁడును బోలెఁ బల్కి యీ
మనికికి రాక తక్కినను మాసెడుఁ గాక మదీయదృష్టికిం
బనుపడి మ్రోల నున్నగతి మాయలు సేయఁగ నేల భర్తకున్.

45

ఖండిత —

చ.

నృపులకు నెల్లవారల భరించుట యోగ్యము గాన నేఁటీరే
యపరిమితోత్సవంబునఁ బ్రియాసదనంబుల కేగి యేగి యా
నెపమున మద్గృహంబునకు నీ వరుదేరఁ బ్రభాత మయ్యెఁ గా
కిపుడు నృసింహ నీపయి నొకించుక వంచనలే దెఱుంగుదున్.

46

కలహాంతరిత —

ఉ.

అనఁగ రానికోపమున నప్పుడు కాంతుని ధిక్కరించుచో
మానదురాగ్రహగ్రహము మానుపలే కపు డెందుఁ బోయెనో
యీననవింటిదంట యపు డేఁపఁ దొడంగె భవిష్యదర్థము
ల్గానని నామనంబునకుఁ గావలె నిట్టివిషాదవేదనల్.

47

ప్రోషితభర్తృక —

చ.

చిరయశ యోబభూవరు నృసింహ భవద్రిపుభామ కాననాం
తరమున కేగి యందు నిజనాథునిఁ గానక మన్మథార్త యై
వరుని సరోజపత్రమున వ్రాయునెడం గరము ల్సెమర్పఁగా
నరయ నిజాంగకంబె పగ యయ్యె నటంచుఁ దలంచు దైవమున్.

48

అభిసారిక —

ఉ.

నాతిమదిం బ్రియాభిసరణం బొనరింపఁ దలంచె దీవు చం
ద్రాతపసాంద్రదీధితు లజాండకటాహమునిండఁ బర్వఁగా
నీతలఁ పెట్లు గూడు రమణీవలె నే నొకనన్నెఁగాఁగ ము
క్తాతతులుం బ్రసూనములు దాల్పు మలంగుము గంధసారమున్.

49


క.

ఈయెనిమిదిభేదంబులఁ, బ్రేయసులు పదాఱ్వురుం బ్రభిన్నాత్మిక లై
యాయతగతి నిల నూటిరు, వైయెనిమిది భేదములును మదిలుదు రెలమిన్.

50


క.

ఇల నీసంఖ్యలఁ దగుసతు, లల యుత్తమమధ్యమాధమాభిఖ్యలఁ జె
న్నలరఁగ మున్నూటెనుబది, నలువురు నాయిక లటండ్రు నవరసరసికుల్.

51