పుట:Nanakucharitra021651mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాధ్యాయము

3

సగము నవ్వుచు సగము మాటలాడుచున్న మనుష్యుని కంఠధ్వని గలుగునట్లేడ్చెనని మంత్రసాని చెప్పెనఁట. అందలి సత్యమేమనగా నానకు తన తండ్రి పుట్టినట్లుఁ దాత పుట్టినట్లుఁ దక్కినమానవులందఱుం బుట్టినట్లు బుట్టియుండును. అందఱు శిశువు లేడ్చినట్లే యేడ్చియుండును. కాని యతని చరిత్రము వ్రాసినవారు వాని గొప్పతన మంతయు జూచిన పిదప నతడా కాలమున లోకైక పూజ్యుఁడైన పిదప వ్రాసియుందురు. కావున నంతటి మహానుభావుడు తక్కిన పామర మానవులవలె బుట్టియుండఁ డని నమ్మి మూర్ఖజనములు చెప్పుకొను మహాద్భుతములు కొన్ని వాని యవతార ఘట్టమునందుఁ జేర్చి యుందురు. అట్లె కాకున్న ప్రకృతిధర్మములు భేదమునందవలసియుండు. అద్భుతములు మహిమలు మొదలగునవి మూర్ఖుల మనస్సులలో నుద్భవించునుగాని నిజముగ జరుగవు.

ఒకనిపుట్టుకలో ఘనత యుండదు. ఒకనిపుట్టుకలో నైచ్యముండదు. ఎవఁడును జన్మించినతోడనే మాటలాడఁడు. తరువాత నెంత గొప్పవాఁడైనను మనుష్యుఁడు పుట్టినప్పుడందఱి వలెనె యాకలి దప్పిక నిద్ర మొదలగు లక్షణములు గలిగి యుండును. ఇట్లనుటచేత కొందఱు మనుష్యుల యం దద్భుత శక్తిలేదని నేననుట లేదు. మనుష్యుని బుద్ధి వికసించిన పిదప వాని విద్యంబట్టియు జ్ఞానముంబట్టియు నొక్కొక్కని కసాధారణ ప్రజ్ఞ గలుగుచుండును. ఒక్కొక్కనికి విస్తారము విద్యలేకపో