పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనుక వృద్దులు నిరాశా నిస్పృహలకు గురౌతారు. మేము అక్కరబట్టని వాళ్లం, లోకానికి మాతో పనిలేదు అనుకొంటారు. పైగా వారికి ఆ ప్రాయంలో వినికిడి, కంటిచూపు మందగిస్తాయి. మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం మొదలైన వ్యాధులు పీడిస్తాయి. ఐనా కొందరు ధైర్యంగాను ఉత్సాహంగాను వుంటారు. పూర్వం తాము సాధించిన కార్యాలను తలంచుకొని గర్వపడతారు. ఆశాభావంతో ధైర్యంతో మృత్యువుకి సిద్ధమౌతారు. కాని కొందరు నిరాశాభావాల్లో పడిపోతారు. చావంటే భయపడతారు. ఈ లోకంలో మరొకసారి జీవించే అవకాశం లేదు కదా అని బెంగపడతారు. విచారంతో రోజులు సాగిస్తారు. ఏది యేమైనా వృద్దులు ఈ లోకాన్ని వదలి శాశ్వత నివాసానికి వెడలి పోవలసిందే. మన జీవితంలోని ఈ దశలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తుండాలి.

2. యుక్త వయసులో ఎదురయ్యే సమస్యలు

యుక్త వయస్సులోకి అడుగిడుతున్న సమయం లేదా యావనారంభ దశలో బాలబాలికల్లో పలురకాలైన మార్పులు చోటుచేసుకుంటాయి. అనేక శారీరక, మానసిక మార్పులు ఈ సమయంలో జరుగుతాయి. యుక్త వయస్సులోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో వారు ఇటు చిన్నపిల్లలూకాదు, అటు పెద్దవారూ కాదు. ఈ రెండింటికీ మధ్య దశలో ఉంటారు. ఇటువంటి దశలోని పిల్లల విషయంలో వారి తల్లిదండ్రులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. యుక్త వయస్సులోకి అడుగు పెడుతున్న తరుణం బాలబాలికల భావోద్రేకాలు అత్యధికంగా ఉండేదశ. వాటిని మనం ఏ విధంగానూ నియంత్రించలేము. ఈ సమయంలో వారిలో కలిగే మార్పులు ఈ కింది విధంగా ఉంటాయి. స్నేహితుల ప్రాముఖ్యం : తనకిష్టమైన వారితో కాలం గడపాలనే ధ్యాస ఎక్కువగా ఉంటుంది.