పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోడివారితో సఖ్యసంబంధాలు పెంచుకోకుండ తమలోకంలో తాముండి పోతారు. ఇతరుల్లో మంచినిగాక చెడ్డను చూడ్డం అలవాటు చేసికొంటారు. విమర్శకు పూనుకొంటారు. నిరాశాభావాలు పెంచుకొంటారు. స్వార్థపరులుగా తయారౌతారు. నేను యోగుణ్ణి కాను అనే భావాన్ని అలవర్చుకొంటారు.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఆయా రంగాల్లో తర్ఫీదునిచ్చే పెద్దలు పిల్లలతో జాగ్రత్తగా మెలగాలి. పసివాళ్ల మనసులు చాల సున్నితంగా వుంటాయి. కనుక వాళ్లను తేలికగా విమర్శించ కూడదు. ఎడాపెడా మాట్లాడ కూడదు. నీవువట్టి మొద్దువి, నీకు చదువరాదు, నీవు ఎందుకు పనికిరావు మొదలైన మాటలు వాడకూడదు. వాళ్లు సాధించిన కొద్దిపాటి విజయానికి కూడ వారిని మెచ్చుకోవాలి. భవిష్యత్తులో నీవు గొప్పవాడివి ఔతావని ఉబ్బించాలి. ప్రతిపిల్లవాడిలోను కొన్ని మంచిగుణాలూ, కొన్ని లోపాలూ వుంటాయి. ఆ మంచి గుణాలను పొగడి లోపాలను చూచీ చూడనట్లు వదలివేయాలి. లోపాలను గూర్చి ఎక్కువగా మాట్లాడితే పిల్లలకు మేలుకి మారుగా కీడు చేస్తాం.

ఆత్మగౌరవం గర్వం కాదు. గర్వితుడు నేను అందరికంటె గొప్పవాణ్ణి అనుకొని ఇతరులను చిన్నచూపు చూస్తాడు. ఆత్మగౌరవం కలవాడు తన్ను తాను అంగీకరించుకొని ప్రశాంతంగా మెలుగుతాడు. బాగా శ్రమచేసి విజయాలు సాధిస్తాడు. ఎప్పడూ ఉన్నతమైన ఆశయాలూ కోరికలూ కలిగి వుంటాడు. ఆశాభావంతో మెలుగుతాడు.

ఆత్మగౌరవం తప్పక అలవరచుకోవలసిన మంచిగుణం. మనలను మనమే విలువతో చూచుకోకపోతే లోకం అసలే విలువతో చూడదు. ఆత్మ గౌరవం లేనివాళ్లు విజయాలు సాధించరు. దేనికీ ముందుకిరారు. ప్రతిదానికి వెనక్కువెనక్కు పోతుంటారు. న్యూనతా భావాలతో బాధపడుతుంటారు. అంతటా మంచినిగాక చెడ్డను చూస్తారు. వీరివల్ల దేశానికి మేలు కలగదు. కనుక యువత ప్రయత్నం చేసి ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలి. అది మన వ్యక్తిత్వంలో ఓ ముఖ్యాంశం కావాలి.