పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కలగవు. భయం, సంకోచం, నేను ఎవరికీ అక్కర బట్టనివాణ్ణి అనే భావాలు కలుగుతాయి.

చిన్నప్పడు పిల్లలను అనాదరం చేయడం నిందించడం, నిరుత్సాహ పరచడం, దుఃఖపెట్టడం మొదలైనవి చేస్తే వాళ్లు తమ్ముతాము నిరాకరించు కొంటారు. వాళ్ల ఆత్మగౌరవం నశిస్తుంది. ఆలా కాక వాళ్లను అంగీకరించడం ప్రశంసించడం, విలువతో చూడ్డం, సంతోష పెట్టడం మొదలైనవి చేస్తే వాళ్లు తమ్ముతాము అంగీకరించుకొంటారు. వాళ్ల ఆత్మగౌరవం కూడ పెరుగుతుంది. కనుక పిల్లలను సున్నితంగా, మనసుకి నొప్పి కలగకుండేలా పెంచాలి. వారికి సంతోషం, ప్రోత్సాహం కలిగేలా చూడాలి.

నరుడు పెరిగి పెద్దవాడై తోడి జనంతో సఖ్యసంబంధాలు పెట్టుకోవాలంటే ఆత్మగౌరవం అవసరం. ఈ గుణం కలవాళ్ల పదిమందితో సులువుగా కలుస్తారు. స్నేహశీలంగా మెలుగుతారు. తోడివారితో నేనూ యోగ్యుణ్ణి, నీవూ యోగ్యుడివే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. తోడిజనం కూడ వీరిని అంగీకరించి వీరితో కలవడానికి ఇష్టపడతారు.

రాజు ఏడేళ్ల కుర్రవాడు. బొమ్మ గీసి తండ్రికి చూపించాడు. అదేమి మెచ్చుకోదగ్గ చిత్రం కాదు. ఐనా తండ్రి వాణ్ణి ప్రశంసించాడు. నీవు పెద్దయ్యాక గొప్ప చిత్రకారుడివి ఔతావని పొగిడాడు. బొమ్మని గోడమీద అంటించి ఇంటిలోని వారికందరికీ చూపించాడు. రాజు ఉబ్బిపోయాడు. నేను మొనగాణ్ణి అనుకొని సంతోషించాడు. అతనికి సహజంగానే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అలవడతాయి. అతడు తోడి జనంతో స్నేహశీలంగా మెలుగుతాడు. సంతోషంగా ఉత్సాహంగా వుంటాడు. విజయాలు సాధిస్తాడు. రేపు మంచిపొరుడుగా తయారై దేశానికి మేలు చేస్తాడు.

లలిత ఆరేళ్ల బాలిక. బళ్లోలో టీచరు నేర్పించిన పాటను తల్లిముందు పాడింది. ఆ పాట ఏమీ బాగాలేదు. తల్లి బాలికను మెచ్చుకోలేదు. నీపాట వినడానికి ఇంపుగా లేదు, ఇంకా బాగా పాడాలి అని చెప్పింది. లలిత నిరుత్సాహ పడింది. చిన్నప్పడు పెద్దలుమెచ్చుకోకపోతే పిల్లలు మానసికంగా ఎదగరు.