పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొగాకుతో సిగరెట్లు, చుట్టలు, బీడీలు, పాను, నశ్యం మొదలైన వస్తువులు తయారు చేస్తారు. వీటన్నిటి లోను నికోటిన్ అనే విషపదార్థం వుంటుంది. మనిషిని చంపడానికి ఒక్క సిగరెట్టులోని నికోటిన్ మాత్రమే చాలు. కాని అదృష్టవశాత్తు మనం సిగరెట్టు త్రాగినప్పడు దానిలోని నికోటిస్ అంతా పీల్చుకోము.

పొగాకులోని నికోటిన్ నోటికీ, గొంతుకీ, ఊపిరి తిత్తులకీ క్యాన్సరు తెచ్చిపెడుతుంది. నెత్తురు నాళాలకు హాని చేస్తుంది. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు సరిగా పనిచేయవు. లైంగిక సామర్థ్యం నశిస్తుంది. పొగ పీల్చడం వలన క్షయ సోకినవారికంటే ఎక్కువమంది చనిపోతున్నారు.

కాఫీ,టీలు అందరూ త్రాగేవే. కాని ఇవి కూడ హానికరమైన పదార్థాల క్రిందికే వస్తాయి. వీటిల్లో కఫేయిన్ అనే రసాయన పదార్థం వుంటుంది. ఇది నాడీమండలాన్నీ మెదడునీ ఉద్రేకపరచి చురుకుదనాన్ని పుట్టిస్తుంది. ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇది అంతగా శక్తిలేని పదార్థం. కాని ఈ పానీయాలను ఎక్కువగా సేవిస్తే వీటికి అలవాటు పడిపోతాం. ఇక వీటిని వదిలించుకోలేం. అందుకే కొందరు ఉదయం మొదట కాఫీ త్రాగందే ఏ పనీ ప్రారంభించలేరు. పైగా ఈ పానీయాలు నిద్రను మందగింప చేస్తాయి. అందుచే వీటిని త్యజించడం మెరుగు.

ఈరోజుల్లో చాలమంది షాపుల్లోనుండి ఆహార పదార్థాలను కొనితెచ్చుకొంటున్నారు. చిప్స, ఊర గాయలు, సోసు, కేకులు, పిజ్జాలు, బర్గర్లు, డబ్బీల్లో వచ్చే మాంసం చేపలు మొదలైనవి ఈ పదార్థాలు. ఇంకా కొక్కొకోలా, పండ్లరసాలు మొదలైనవి కూడ కొనితెచ్చుకొంటున్నారు. అన్ని ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతాయి. కనుక పై పదార్థాలను తయారు చేసేవాళ్లు అవి చెడిపోకుండ వుండడానికి వాటిల్లో కొన్ని రసాయనాలు కలుపుతారు. ఈ రసాయనాలు మన ఆరోగ్యాన్ని చెరుస్తాయి. పై ఆహారవస్తువులను మనం కొద్ది కొద్దిగా సేవిస్తాం. కనుక అవి చేసే చెరుపుని వెంటనే గుర్తించం. కాని వాటిని వారాలు మాసాలు ఏండ్ల తరబడి వాడడం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. కనుక షాపుల్లో అమ్మే ఆహార పదార్థాలను వాడకుండడం మంచిది.