పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున్నాయి. ఇవి నాడీ మండలాన్ని ఉద్రేకపరుస్తాయి. మానసిక స్థితిని మార్చి వేస్తాయి.

ఈ పదార్థాల్లో రెండు ప్రధాన లక్షణాలు వుంటాయి. మొదటిది, ఎక్కువ మోతాదులో తీసికొంటే ఇవి మన శరీరాన్ని విషపూరితం జేసి చావుని తెచ్చి పెడతాయి. రెండవది, ఒకసారి అలవాటు పడితే ఇక వీటిని వదిలించుకోవడం కష్టం.

ఈ పదార్థాల్లో కొన్నిటిని ప్రభుత్వం నిషేధించింది. వీటి ఖరీదు కూడ ఎక్కువ. కనుక ఇవి జనానికి అట్టే అందుబాటులో వుండవు. అందుచే ఇవి సామాన్య జనానికి అంతగా అపకారం చేయలేవు. వేరేవాటిమీద ప్రభుత్వ నిషేధం లేదు. వీటి ధరకూడ తక్కువ. కనుక సామాన్య జనం వీటిని ఎక్కువగా వాడతారు. మనం గ్రహించకపోయినా సామాన్య జనానికి ఎక్కువ కీడు చేసేది ఇవే.

సారా, పొగాకు, కాఫీ టీలు, షాపుల్లో అమ్మే ఆహార పదార్థాలు, డోక్టరు అనుమతితో అమ్మే మందులు, మనంతట మనమే వాడే మందులు మొదలైనవి హానికరమైన పదార్థాలు. ఇక, వీటిని గూర్చి కొంచెం విపులంగా తెలిసికొందాం.

సారా లేక మద్యం మన కాలేయాన్ని మెదడునీ, మూత్రపిండాలను, గుండెనూ చెడగొడుతుంది. త్రాగి వాహనాలు నడిపేవాళ్లు ప్రమాదాలు తెచ్చిపెడతారు. మద్యంలో చాల రకాలున్నాయి. వీటి ఖరీదు కూడ ఎక్కువే. పేదలు త్రాగుడు మరిగితే ఇల్లు గుల్లవుతుంది. సంసారం గడవదు.

మద్యం మన ప్రవర్తనను కూడ మార్చివేస్తుంది. త్రాగినవాళ్లలో కొందరు అధిక ధైర్యం తెచ్చుకొని అపాయకరమైన పనులు చేస్తారు. కొందరు సిగూ సెరమూ కోల్పోయి నీచ కార్యాలకు పాల్పడతారు. కొందరు అమిత సంతోషంతో ఊహాలోకంలోకి జారుకొని తాము చేయవలసిన పనులు కూడ చేయరు. కొందరు విషాదానికి గురై ఆత్మహత్యకు పాల్పడతారు. కొందరు కోపావేశంతో తగాదాలకు పూనుకొంటారు. ఇన్ని అనర్ధాలు తెచ్చిపెడుతుంది కనుక మద్యపానాన్ని పూర్తిగా మానివేయాలి.