పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలామందికి వాళ్లు రోజూ ఎంతకాలం వ్యర్థం చేస్తున్నారో కూడ తెలియదు. సమయాన్ని సక్రమంగా వాడుకోవాలంటే మనం రోజూ ఆయా కార్యాలకు ఎంత సమయం వినియోగిస్తున్నామో తెలిసివుండాలి. రోజూ మనం నష్టపరిచే సమయం ఎంతో గుర్తుపట్టాలి. ఆ నష్టాన్ని తొలగించుకొనే ప్రయత్నం చేయాలి. డబ్బు నష్టపోతే డబ్బు మాత్రమే పోయినట్లు. కాని కాలాన్ని నష్టపోతే మనజీవితాన్నే నష్టపోయినట్లు. జీవితమంటే కొన్నిగంటలూ రోజులే కదా!

కొంతమందికి సమయం గడవదు. రోజంతా ఏమిచేయాలో తోచదు. విసుగుపడుతుంది. మరి కొందరికి సమయం బహువేగంగా గడచిపోతుంది. రోజుకి 24 గంటలు చాలవు. ఇంకా కొన్ని గంటలు అదనంగా వుంటే బాగుండు అనిపిస్తుంది. మనం పనిజేసికొనే తీరునుబట్టి ఈ వ్యత్యాసం కన్పిస్తుంది.

ప్రతి వస్తువుకి ఒక తావు, అన్ని వస్తువులు ఏ తావులో అవి అనేది ప్రాచీన సూత్రం. ప్రతి పనికి ఓ సమయం, అన్ని పనులు వేటి కాలంలో అవి అనేది ఆధునిక సూత్రం కావాలి. కాలాన్ని సక్రమంగా వాడుకోవడమంటే పనులు సకాలంలో చేసి ముగించడమే. కార్యాలు వాయిదా వేసేవాడు విజయాన్ని సాధించలేడు. మనం వ్యర్థపరిచే కాలమే మనకు విజయాన్ని సాధించి పెట్టేది కావచ్చు గదా!

చాలమంది మాకు సమయం దొరకడం లేదు అని వాపోతుంటారు. వీళ్లు సీతాకోకచిలుక పూవునుండి పూవుకు పోయినట్లుగా పనినుండి పనికి మారుతుంటారు. దేనిమీద మనసు నిల్పరు. దేనిలోను విజయం సాధించరు. ఎప్పడూ ఏవేవో పనులు చేసినట్లే వుంటారు. అవసరమైన కార్యాలు మాత్రం చేయరు. సమయం ఎందుకు దొరకదు? మనకు ാജും అనిపించిన దాన్ని తప్పకుండ చేస్తాం. ఫలానా కార్యం చేయడం అవసరం అనుకొని పనికి పూనుకొనేవాడికి సమయం తప్పకుండ దొరుకుతుంది.

జీవితకాలం ఎంతో స్వల్పమైంది. ఎంతో విలువైంది. ఐనా చాలమంది ఈ కాలాన్ని తేలికగా నష్టపరుస్తుంటారు_చేయవలసిన మంచిపనులు చేయరు.