పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోకూడదు. వాళ్ల దుర్విమర్శలు చేస్తారు. ప్రతిదానికీ గొణగుతుంటారు. సంకుచిత భావాలతో జీవిస్తారు. సోమరులుగా వుంటారు. అప్రయత్నంగానే ఈ దుర్గుణాలు మనకు కూడ పట్టబడతాయి.

14. కాలం అమూల్య సంపద

ఒక ప్రాచీనసూక్తి రువ్వినబాణం, పలికిన పలుకు, జరిగిపోయిన అవకాశం, నష్టపరచిన కాలం అనే నాలుగు తిరిగిరావని చెప్తుంది. విద్యార్థులు పరీక్షకు సిద్ధం కావడానికి కాలం సరిపోవడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. కాని వున్నకాలాన్ని సరిగా వాడుకునేవాళ్లు ఎంతమంది? భగవంతుడు అందరికీ కాలం సమానంగానే యిస్తాడు. దేశాధ్యక్షుడికైనా, ప్రధాన మంత్రికైనా, విద్యార్థికైనా రోజుకి 24 గంటలే. ఈ నియమిత కాలాన్ని కొందరు సక్రమంగా వాడుకొని మంచి ఫలితాలు సాధిస్తారు. కొందరు ఇదే కాలాన్ని దుర్వినియోగంజేసి నష్టాన్ని తెచ్చుకొంటారు. సరిగా వాడుకొనేవాళ్లకు కాలం ఎప్పడూ సరిపోతుంది. వాడుకోనివాళ్లకు సరిపోదు.

భగవంతుడు మనకిచ్చిన అమూల్యవరాల్లో కాలంగూడ వొకటి. కాని అందరూ దాని విలువను గుర్తించరు. కాలమంతా ఒకేసారి మన చేతుల్లోకి రాదు. విధాత తెలివితో దాన్ని మనకు ముక్కముక్కలుగా ఇచ్చాడు. ఈ ముక్కలనే మనం క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు అంటున్నాం. సక్రమంగా వాడుకొన్న క్షణాలే తర్వాత మన జీవితకాలంగా మారిపోతాయి.

ఆధునిక యుగంలో ప్రజలు సమయానికి ఎంతో విలువనిస్తున్నారు. సమయాన్ని బాగా వినియోగించుకొని ఉత్పత్తులు పెంచుకోవాలని చూస్తున్నారు. పెద్దపెద్ద కర్మాగారాలు, ఆఫీసులు మొదలైన వాటిల్లో కాలాన్ని డబ్బుతో సమానంగా గణిస్తారు. ఇంతకాలంలో ఇంత వుత్పత్తి జరగాలని ఖండితమైన నియమాలు పెడతారు. ఆ నియమాలను పాటించకపోతే జరిమానా విధిస్తారు.