పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూరడానికి సిద్ధమౌతారు. వారిలో శారీరకంగా, ఉద్వేగపరంగా, హార్మోనుల దృష్ట్యా పెద్దమార్పులు వస్తాయి. వ్యక్తిత్వం ప్రారంభమౌతుంది. స్వతంత్ర ప్రవర్తనం అలవడుతుంది. స్నేహితులతో కలసి వుండడం అతిముఖ్యం అనిపిస్తుంది. పొగత్రాగడం, మద్యం మత్తుపదార్థాలు సేవించడం అలవాటు చేసికొంటారు. కొందరు సెక్సు ప్రయోగాలకు పూనుకొంటారు. మరికొందరు తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతారు. వారి ఆచార వ్యవహారాలను ప్రశ్నిస్తారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు కూడ మధ్యవయస్సులో ఎదురయ్యే సంక్షోభాలను ఎదుర్కొంటారు.

4. కాలేజి చదువుల కాలం 18-25

ఈ కాలంలో యువతీ యువకులు కాలేజీలు చదివి డిగ్రీలు సంపాదిస్తారు. కొందరు తమకు ఆసక్తి లేని సబ్జెక్టుల్లో డిగ్రీ తీసికోవలసి వస్తుంది. భవిష్యత్తులో ఏ మార్గాన్ని ఎన్నుకోవాలి అనే ప్రశ్న ఉద్యోగాన్వేషణ ప్రారంభమౌతాయి. కొందరు వృత్తి విద్యల్లో చేరతారు. ఈ తరుణం యువతీయువకులు బాగా శ్రమించి పని చేయవలసిన కాలం. సాంఘిక సేవా కార్యక్రమాలకూ, వ్యాసంగాలకూ, విరామానికీ అట్టే సమయం లభించదు. డిగ్రీ సంపాదించడం, ఉద్యోగం కొరకు గాలించడం ప్రధానాంశాలు ఔతాయి. 3-4 దశలు యావనం క్రిందికే వస్తాయి.

5. వయోజనులు 25-40 ఈ దశలో నరులు పెండ్లిజేసికొంటారు. కొందరు క్రొత్త యింటికి కదులుతుంటారు. వంటిరివాళ్లు ఒక యింటివాళ్లు ఔతారు. పిల్లలు పుడతారు. అనుకూల దాంపత్యం, భాగస్వామితో చొద్దికగా మెలగడం కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు. కొందరికి కుటుంబంలోని బంధువర్గంతో సమస్యలు ఎదురౌతాయి. ఒకవైపు ఉద్యోగానికి కాలం కేటాయించాలి. మరోవైపు భాగస్వామి, పిల్లల అవసరాలు తీర్చడానికి సమయం వినియోగించాలి. చాల పర్యాయాలు ఈ రెండుధర్మాల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఒకటి వెలుపలికి లాగితే మరొకటి లోపలకి లాగుతుంది. జీవితంలోని లోతుపాతులు, కష్టసుఖాలు కొంతవరకు అనుభవానికి వస్తాయి.